గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 31 జులై 2023 (12:07 IST)

నాతో స్నేహం... ఓ హగ్ ఇస్తే అన్ని విధాలా సాయం చేస్తా : ఉద్యోగినికి డీఎస్పీ వేధింపులు

harassment
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో పని చేసే ఓ ఉద్యోగినికి సీఐడీ విభాగంలో డీఎస్పీగా పని చేసే కిషన్ సింగ్ లైంగికంగా వేధించాడు. తనతో స్నేహం చేసి, తనను కౌగిలించుకుంటే అన్ని విధాలా సాయం చేస్తానని ఆ మహిళా ఉద్యోగిని వేధించాడు. ఈ మేరకు డీఎస్పీ చేసిన చాటింగ్‌కు సంబంధించిన చాటింగ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 
 
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో సీనియర్ అసిస్టెంట్‌గా ఓ మహిళ పని చేస్తుంది. ఈమెకు రెండేళ్ల క్రితం అంబర్ పేటలో పీటీసీలో డీఎస్పీగా పనిచేస్తున్న కిషన్ సింగ్ పరిచయమయ్యాడు. మహిళతో మాట కలిపిన డీఎస్పీ.. ఆమెకు హిందీ సినిమా పాటలు, ఇతర వీడియోలతో వాట్సాప్‌లో తరచుగా సందేశాలు పంపించసాగాడు. ఎందుకు ఇలాంటివి పంపిస్తున్నారంటూ ప్రశ్నించినా డీఎస్పీ తీరు మారలేదు. విసిగిపోయిన మహిళ.. ఆ సందేశాలకు బదులివ్వడం మానేయగా.. ఏడాదికాలంగా డీఎస్పీ సైతం ఎలాంటి సందేశాలు పంపలేదు. 
 
తాజాగా ఓ కేసు వ్యవహారంలో తనకు సాయం చేయాలంటూ సదరు మహిళ డీఎస్పీకి ఫోన్ చేయగా దీన్ని అవకాశంగా తీసుకున్నాడు. తనతో స్నేహం చేయాలని.. తనను కౌగిలించుకుంటే అన్ని విధాలా సాయం చేస్తానంటూ వేధింపులకు పాల్పడ్డాడు. అలా చేయకుంటే తనకు దూరంగా ఉండాలని.. ఫోన్ చేయొద్దని చెప్పేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు ఈ నెల 28న రాచకొండ షీ టీమ్స్‌ను ఆశ్రయించగా, వారు ఫిర్యాదును తీసుకుని డీఎస్పీ కిషన్ సింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.