శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (09:07 IST)

తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ కాలం పొడగింపు??

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 యేళ్ళ నుంచి 60 లేదా 61 యేళ్ళకు పెంచే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన బుధవారం జరిగే కేబినెట్‌ సమావేశంలో ఈ అంశాన్ని టేబుల్‌ ఎజెండాగా పెట్టి, చర్చించి, ఆమోదించిన తర్వాత పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌ను సవరిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసే అవకాశం ఉంది. 
 
ఒకవేళ ఆ రోజు వీలుపడని పక్షంలో ఆగస్టు 15వ తేదీన సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ఉద్యోగుల వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 లేదా 61 ఏళ్లకు పెంచుతామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. దీనివల్ల ఆర్థికంగా ఎంత భారం పడుతుందనే అంశంపై అధ్యయనం చేసి, నివేదిక అందించే బాధ్యతలను వేతన సవరణ కమిషన్‌(పీఆర్‌సీ)కు ప్రభుత్వం అప్పగించింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 600 నుంచి 1000 మంది ఉద్యోగ విరమణ చేస్తుంటారు. ఆగస్టులో ఏకంగా 1200 నుంచి 1400 మంది రిటైర్‌ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి కూడా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. 
 
తనకొక్కడికే ఎక్స్‌టెన్షన్‌ ఇస్తే... తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశం ఉందని, అందరితో పాటే తనకూ మేలు చేయాలని ఆయన కోరుతున్నట్లు తెలిసింది. అయితే, వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతారా? లేక 61 ఏళ్లుగా మార్చుతారా? అనేది సీఎం కేసీఆర్‌ చేతిలోనే ఉంది.