సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (22:05 IST)

తెలంగాణ ఎన్నికలు 2023 : బుల్లెట్ టు బ్యాలెట్! అసెంబ్లీ సీటుపై మాజీ మావో..?

telangana assembly
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పోటీ చేసే అభ్యర్థులు వేగంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టు గజర్ల అశోక్ అసెంబ్లీ సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది.
 
ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. రెండు పార్టీలకు బదులు బీజేపీ ఒక్క అవకాశం అడుగుతోంది. 
 
బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా, త్వరలో కాంగ్రెస్ జాబితా రానుంది. అయితే అభ్యర్థుల ఎంపికలో హస్తం పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ముఖ్యమైన స్థానాలపై లీకులు బయటకు వస్తుండగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి సంబంధించి కొత్త పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. 
 
అభ్యర్థుల రేసులో ఆయన పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తోందనే చర్చ సాగుతోంది. దీంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. గజర్ల అశోక్ అలియాస్ అయితు మాజీ మావోయిస్టు. రాష్ట్ర కమిటీ సభ్యునిగా పనిచేయడమే కాకుండా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 
 
అశోక్ రెండు దశాబ్దాలు ఉద్యమంలో పనిచేశారు. 2016లో వారు జీవన స్రవంతిలో చేరారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అశోక్ పేరు తెరపైకి వచ్చింది. అశోక్ కూడా మీడియాతో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 
 
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రజలను పీడిస్తున్నాయని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.