1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (09:42 IST)

నేటి తెలంగాణ వ్యాప్తంగా బూస్టర్ కరోనా డోస్‌ల పంపిణీ

Booster shot
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలు అప్రమత్తమై కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, కరోనా మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బూస్టర్ డోస్ టీకా వేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుతం 5 లక్షల బూస్టర్ డోస్‌లు అందుబాటులో ఉంచింది. 
 
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. మంగళవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 7,633 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 61,233కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 5,31,152కి చేరింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బూస్టర్ డోస్‌లను అదించాలని నిర్ణయించడం గమనార్హం. 
 
బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోర్బె వాక్స్ కరోనా టీకాను బూస్టర్ డోస్‌గా అందించనున్నట్టు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ హెల్త్ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు ఐదు లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. మొదటి రెండు డోసులు కోవాగ్జిన్, కోవిషీల్డ్ వీటిలో ఏది తీసుకున్నప్పటికీ బూస్టర్ డోసుగా కోర్బె వాక్స్ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చని ఆయన సూచించారు.