మాస్క్ ధరించకుంటే కఠిన చర్యలు తీసుకోండి : తెలంగాణ సర్కారు ఆదేశాలు
దేశంలో రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. గత వారం రోజులుగా భారీ సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి అధికంగా ఉంటే.. మరికొన్ని రాష్ట్రంలో కూడా ఆందోళనకరంగానేవుంది.
ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అదేసమయంలో తెలంగాణలో కూడా గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మాస్కుల వినియోగం తప్పనిసరి జీఓ జారీ చేసింది.
మాస్కులు ధరించని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం, ఐపీసీ కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మాస్క్ ధరించని వారి నుంచి అపరాధం కూడా వసూలు చేయాలని ఆదేశించింది. ర్యాలీలు, ఒకే చోట ప్రజలు గుంపులుగా ఉండటంపై కప్పదా ఆంక్షలు విధించింది.
అదేవిధంగా, ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి ర్యాలీలు, ఉత్సవాలకు అనుమతి లేదని స్పష్టంచేసింది. బహిరంగ ప్రదేశాలు, స్థలాలు, పార్కుల్లో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదన్నారు. హోళి, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ తదితర సందర్భాల్లో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపింది.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,804కి చేరింది.
ఇందులో 2,99,878 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 4,241 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1685కి చేరింది.