1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (09:59 IST)

విద్యార్థులకు శుభవార్త : ప్రశ్న పత్రాలు 11 నుంచి 6కు కుదింపు .. ఏ రాష్ట్రంలో!

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు గత మార్చి నెల నుంచి తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. పలు పాఠశాలలు మాత్రం ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ.. ఈ యేడాదంతా విద్యార్థుల చదువులు పూర్తిగా సాఫీగా సాగలేదని చెప్పొచ్చు. దీంతో ప్రభుత్వాలు పలు రకాలైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 
 
ముఖ్యంగా, ఈ విద్యాసంవత్సరం తరగతలు జరగకపోవడంతో పదో తరగతి పరీక్షల్లో పేపర్లు కుదించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 11గా ఉన్న ప్రశ్న పత్రాల సంఖ్యను ఆరుకు కుదించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వచ్చే యేడాది ఏప్రిల్, మే నెలల్లో వార్షిక పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్న విద్యాశాఖ ఈసారి మాత్రం ఒక్కో సబ్జెక్టుకు ఒక్క ప్రశ్న పత్రం మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది.
 
ఇప్పటివరకు ఒక్కో సబ్జెక్టుకు రెండు ప్రశ్న పత్రాలు ఉండగా, హిందీకి మాత్రం ఒకటే ఉంటోంది. ప్రశ్నల్లో చాయిస్‌లతోపాటు బహుళ ఐచ్ఛిక ప్రశ్నల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలు తెరిచిన తర్వాత పనిదినాలను బట్టి ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
 
ప్రస్తుతం కరోనా కేసులు నెమ్మదిస్తూ పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత 9,10 తరగతుల విద్యార్థుల కోసం స్కూళ్లు తెరిచి ప్రత్యేక బోధన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటికి పరీక్షల సమయం ఇంకా నాలుగు నెలలు ఉంటుంది కాబట్టి సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు కావాల్సినంత సమయం లభిస్తుందని చెబుతున్నారు.