గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (17:41 IST)

తెలంగాణలో ప్రమాదకరమైన వాతావరణం: దట్టంగా కమ్మిన మబ్బులు

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. తెలంగాణలో వర్షాలు, పిడుగులు హడలెత్తిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. గంట వ్యవధిలో నాలుగు చోట్ల పిడుగులు పడ్డాయి. నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ మెరుపులు, ఉరుములతో జనాలు భయాందోళనల్లో ఉన్నారు. 
 
వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడుతోంది. ఈ క్రమంలో నగరంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడ చూసినా ఇంకా వరదనీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి.
 
శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన భారీ, అతి భారీ వర్షాలకు హయత్ నగర్ డివిజన్‌లోని లంబాడీ తండ కాలనికి వరద నీరు చేరడంతో మొత్తం150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమాచారం మేయర్ గద్వాల విజయ లక్ష్మికి వచ్చిన వెంటనే హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్‌కు ఫోన్ చేసి లంబాడీ తండ వాసులను తరలించాలని ఆదేశించారు. 
 
మేయర్ వెంటనే వారిని తరలించేందుకు అక్కడికి వాహనం కూడా పంపించారు. డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ ఆధ్వర్యంలో బాధిత 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారికి త్రాగు నీరు భోజన వసతి కల్పించారు.