మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (11:36 IST)

దళితుల ముక్కుతో నేలకు రాయించి.. మురికి నీటిలో మునక..

తెలంగాణ రాష్ట్రంలో దళితుల పట్ల బీజేపీ నేత అమానుషంగా ప్రవర్తించాడు. ఆ నేత పేరు భరత్ రెడ్డి. ఈ దారుణం నిజామాబాద్ జిల్లా నవీపేటలో అభంగపట్నంలో జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో దళితుల పట్ల బీజేపీ నేత అమానుషంగా ప్రవర్తించాడు. ఆ నేత పేరు భరత్ రెడ్డి. ఈ దారుణం నిజామాబాద్ జిల్లా నవీపేటలో అభంగపట్నంలో జరిగింది. ఈ కేసులో భరత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ పోలీసులకు లొంగిపోయాడు. ఆ వ్యవహారం జరిగినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన విషయం తెల్సిందే. అయన కోసం నిజామాబాద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, చివరకు ఆయన స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు.
 
దీనిపై ఇద్దరు బాధిత దళితులు స్పందిస్తూ, భరత్ రెడ్డి తమను కర్రతో కొట్టి, బూతులు తిడుతూ, రోడ్డుపక్కనే ఉన్న బురదగుంటలో ముంచడం అన్నీ వాస్తవమేనని అవి షార్ట్ ఫిలిం కోసం తీసినది కాదని లక్ష్మణ్, రాజేశ్వర్ స్పష్టంచేశారు. అతను తమను బలవంతంగా హైదరాబాద్ తరలించి అక్కడ 20 రోజులపాటు వేర్వేరు ప్రాంతాలలో తిప్పి తమను చాలా భయపెట్టి, చంపేస్తామని, అందుకే షార్ట్ ఫిలింలో నటించామని, డబ్బులు పుచ్చుకొన్నామని చెప్పామన్నారు. భరత్ రెడ్డి అరెస్ట్ చేసి చట్ట ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని వారిరువురూ డిమాండ్ చేశారు. భరత్ రెడ్డి ఒక హత్యకేసులో నిందితుడుగా ఉన్న విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారు. దానిపై కూడా హైకోర్టులో విచారణ జరుగుతోందని చెప్పారు. 
 
దీనిపై భరత్ రెడ్డి స్పందిస్తూ, "రోజు మేము దొరలరాజ్యం అనే షార్ట్ ఫిలిం కోసమే ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాము. నేటికీ అనేక గ్రామాలలో దళితులపై దొరల పెత్తనం కొనసాగుతూనే ఉంది. అదే లోకానికి చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో మేము షార్ట్ ఫిలిం కోసం ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తే, దానిని సోషల్, ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాలు వక్రీకరించాయి. అ కారణంగానే నాపై కేసు నమోదు అయ్యింది. నాపై జరిగిన ఈ కుట్రను తప్పకుండా చేధిస్తాను. దీనిపై న్యాయపోరాటం చేస్తాను. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశాను' అని చెప్పుకొచ్చారు.
 
అయితే, దళిత యువకుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమేకాకుండా వారిని కిడ్నాప్ చేసి భయపెట్టడం వంటి చట్టవ్యతిరేక పనులు చేశారు. వారిపట్ల ఇంత అనుచితంగా ప్రవర్తించి, మళ్ళీ దానిని కప్పి పుచ్చుకోవడానికి షార్ట్ ఫిలిం అనే కొత్త నాటకం మొదలుపెట్టారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడి తర్వాత భరత్ రెడ్డి గత 22 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెల్సిందే. వాస్తవానికి ఈ ఇద్దరు దళిత యువకులు భరత్ రెడ్డి సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడం వల్లే ఇంత దారుణ చర్యకు పాల్పడినట్టు సమాచారం.