గ్రామాల్లో మంచినీటికి కటకట.. ఏరులై పారుతున్న మద్యం
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలుగ్రామాల్లో గుక్కెడు మంచినీరు లభించక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కానీ, బీరు ఏరులై పారుతోంది. గత మార్చి నెలతో చూస్తే ఏఫ్రిల్ నెలలో అనూహ్యంగా మద్యం విక్రయాలు పెరిగాయి. గతంలో ఎన్నడూలేనంతగా వరుసగా రెండు నెలల్లో బీర్ల అమ్మకాలు ఏకంగా రెండింతలు పెరగడం గమనార్హం.
ఐపీఎల్ మ్యాచ్‌లకుతోడు, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో విక్రయాలు అమాంతంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నూతన సంవత్సరం వేడుకలు జరిగే డిసెంబర్, జనవరి నెలల కన్నా.. మార్చి, ఏఫ్రిల్ నెలల్లో రెండు రెట్లు అధికంగా బీర్ల విక్రయాలు జరగడం గమనార్హం. అయితే మార్చితో చూస్తే ఏఫ్రిల్ బీర్ల విక్రయాలు 2 వేల కేస్‌లు తగ్గాయి.
ఇందుకు నోస్టాక్ బోర్డులు ఉండటంతోనే అని అధికారులు చెబుతున్నారు. ఎండకాలం కావడంతో సంగారెడ్డి పరిధిలో ఉన్న ఉత్పత్తి కేంద్రాల్లో తీవ్ర నీటికొరత వేధిస్తుండటంతో కొంత మేర ఉత్పత్తిని తగ్గించినట్లు తెలిసింది. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుని ఉత్పత్తి చేస్తున్నారు.
ఇక మార్చి నెలతో చూస్తే ఏఫ్రిల్‌లో లిక్కర్ విక్రయాలు 3 లక్షల కేసులు అధికంగా ఉండటం గమనార్హం. మార్చి నెలలో 25,47,023 ఐఎమ్‌ఎల్ కేస్‌లు విక్రయాలు జరగగా ఏప్రిల్ నెలలో 28,55,092 కేస్‌లు అమ్ముడు పోయాయి. ఇక బీర్లు మార్చి నెలలో 52,61,316 కేస్‌లు అమ్ముడుపోగా, ఏప్రిల్ నెలలో కేవలం 2 వేల కేస్‌లు మాత్రమే తగ్గి 52,59,092 కేస్‌లు విక్రయాలు జరిపినట్లు అధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి.