కుమార్తెను వేధిస్తున్న అల్లుడికి నిప్పంటించిన అత్త.. సహకరించిన కుమార్తె
తమ కుమార్తెను నిత్యం వేధిస్తున్న అల్లుడుని అంతమొందించాలని అత్త నిర్ణయించుకుంది. అంతే.. అల్లుడికి నిప్పు అంటించింది. ఈ పని చేసేందుకు తల్లికి కుమార్తె తన వంతు సహకారం అందించింది. ఈ దారుణం తెలంగాణా రాష్ట్రంలోని మల్కాజిగిరిలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అడ్డగుట్ట పొచమ్మ దేవాలయం వద్ద నివసించే దండుగళ్ల నాని (28) అనే వ్యక్తి కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. మల్కాజిగిరి ఠాణా పరిధిలోని జేఎల్‌ఎన్‌ఎస్ నగర్‌లో నివసించే అనిత అలియాస్ సోని(26)తో 2015లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె హసిని ఉంది.
అయితే, నానికి మద్యం అలవాటు ఉంది. తాగిన మైకంలో భార్యను నిత్యం వేధిస్తూ వచ్చాడు. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోగా వేధింపులు అధికమయ్యాయి. దీంతో తొమ్మిది నెలల క్రితం మల్కాజిగిరి ఠాణాలో భర్తపై భార్య ఫిర్యాదు చేసి, పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో ఈ నెల 13న కుమార్తెను చూసేందుకు నాని ఆమె వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అత్త, అల్లుడి మధ్య వాగ్వాదం జరిగింది. అల్లుడు మాటలకు ఆగ్రహం చెందిన అత్త తిరుపతమ్మ అలియాస్ పార్వతమ్మ(45), కుమార్తెతో కలిసి అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. గాంధీలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి అతడు మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.