గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 మార్చి 2022 (11:28 IST)

వన్ మ్యాన్ షో కట్టడికి సీనియర్ల యత్నాలు... మర్రి శిశిధర్ రెడ్డి నివాసంలో భేటీ

తెలంగాణ రాష్ట్రంలో వన్ మ్యాన్ షో కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతానికి సీనియర్ కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలు మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో సమావేశంకానున్నారు. ఈ రహస్య భేటీలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రక్తికట్టిస్తున్నాయి. 
 
తెలంగాణ రాష్ట్రంలో ఈ దఫా కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో అధికార తెరాసను గద్దె దించేందుకు బీజేపీ పక్కా వ్యూహాలతో పాదయాత్రలకు ప్లాన్ చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా వన్ మ్యాన్ షో (రేవంత్ రెడ్డి)ను కట్టడి చేయాలంటూ రహస్య భేటీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. 
 
ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేయాలంటూ ఏకంగా హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం వరుస భేటీలు నిర్వహిస్తూ గాంధీ భవన్‌ను హీటెక్కిస్తున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో సీనియర్ నేతలు గీతారెడ్డి, హనుమంత రావు, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోదంరెడ్డి, నిరంజన్, కమలాకర్ రావు, శ్యాం మోహన్‌లు సమావేశమయ్యారు. ఈ సమావేశం మూడు గంటలకు పైగా సాగింది. ఆదివారం కూడా మరోమారు భేటీ కావాలని భావిస్తున్నారు.