సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (09:52 IST)

మా రూటే సెపరేటు... తెలంగాణాలో మే 21 వరకు లాక్‌డౌన్??

కరోనా వైరస్ చివరి లింకును తెంచేవరకు విశ్రమించేది లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఆ దిశగానే ఆయన తీసుకునే చర్యలు ఉన్నాయి. దేశంలో తొలి కరోనా వైరస్ కరళ రాష్ట్రంలో నమోదైంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే వెలుగు చూసింది. అలాగే, తొలి మరణం కూడా తెలంగాణాలో నమోదైంది. అందుకే ఆయన తమ రాష్ట్రం నుంచి కరోనా వైరస్‌ను పూర్తిగా తరిమికి కొట్టాలని కంకణం కట్టుకున్నారు. ఫలితంగా ఆయన రేయింబవుళ్లు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా దూకుడు పెద్దగా కనిపించలేదు. జీహెచ్ఎంసీ పరిధితో పాటు.. ఒకటి రెండు జిల్లాల్లో మినహా, పెక్కు జిల్లాల్లో కరోనా కేసులు నమోదుకావడం లేదు. 
 
అయినప్పటికీ... ఒక్క కేసు కూడా నమోదు కానంతవరకు ఆయన లాక్‌డౌన్‌ను అమలు చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగానే మే 17వ తేదీతో దేశ వ్యాప్తంగా ఉన్న మూడో దశ లాక్‌డౌన్ ముగియనుంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీన్ని మరో వారం రోజులు పొడగించి, అంటే మే 21వ తేదీ వరకు దీన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
వాస్తవానికి కేంద్రం అమలు చేస్తున్న మూడో దశ లాక్‌డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ఇది ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. అయితే, కొత్తగా గుర్తించిన కంటైన్మెంట్ జోన్ల క్వారంటైన్ గడువు 21తో ముగుస్తుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఆ మేరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తేనే మంచిదన్న ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో కరోనా విస్తరణ, లాక్‌డౌన్, మద్యం షాపుల పునఃప్రారంభం, వలస కార్మికుల తరలింపు, ప్రజా రవాణా తదితర అంశాలపై ప్రగతి భవన్‌లో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన కేసీఆర్, అన్ని అంశాలపైనా చర్చించారు. రెండువారాల పాటు లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించగా, అంతేసమయం పాటు రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ను పొడిగించాలని పలువురు అధికారులు సీఎంకు సూచించినట్టు తెలిసింది.
 
ఇక మంగళవారం నాడు జరిగే కేబినెట్ సమావేశంలో లాక్‌డౌన్, మద్యం విధానం, సడలింపులపై నిర్ణయం తీసుకుని, దాన్ని కేసీఆరే స్వయంగా ప్రజలకు తెలియజేస్తారని అధికార వర్గాలు అంటున్నాయి. 7వ తేదీ తర్వాతి వ్యూహంపై మార్గదర్శకాలను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.
 
రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉన్నందున, లాక్‌డౌన్‌ను కొనసాగిస్తేనేమేలని అధికారులు కేసీఆర్‌కు సూచించారు. ఇక, ఈ విషయంలో ప్రజాభిప్రాయం కూడా తెలుసుకోవాలని కేసీఆర్ కోరినట్టు తెలుస్తోంది.