కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో మహిళపై 11 మంది గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

victim
ఠాగూర్| Last Updated: బుధవారం, 26 ఆగస్టు 2020 (07:34 IST)
ఇటీవలికాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలతో పోలీసులు ఎన్నో రకాలైన కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ఈ నేరాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఓ మహిళపై ఏకంగా 11 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌ కలెక్టరేట్‌కు సమీపంలో సోమవారం అర్థరాత్రి ఈ దారుణం జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పోలీసుల కథనం ప్రకారం.. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. క్షతగాత్రురాలిని ఆమె సోదరి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించింది. పని నిమిత్తం సోమవారం రాత్రి ఆమె రైల్వే స్టేషన్‌ సమీపంలోకి వెళ్లింది. ఒంటరిగా ఉన్న సదరు మహిళను చూసిన విక్కీ అనే యువకుడు మాట కలిపాడు.

డబ్బులు అవసరం ఉందని చెప్పడంతో తాను ఇస్తానని నమ్మబలికి.. కలెక్టరేట్‌ దగ్గర ఉన్న ధర్నా చౌక్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు. రెవెన్యూ భవన్‌కు సంబంధించిన ఖాళీ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ లోపు విక్కీ స్నేహితులు 11 మంది అక్కడకు చేరుకుని ఒకరి తర్వాత మరొకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అదేసమయంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం రావడాన్ని గమనించిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.

అర్థరాత్రి వేళ అచేతనంగా కనిపించిన బాధితురాలిని పెట్రోలింగ్‌ సిబ్బంది ప్రశ్నించగా.. జరిగిన దారుణం గురించి తెలిపింది. బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది నగరంలోని హమాల్‌వాడీకి చెందిన యువకులని.. విక్కీ పెయింటర్‌గా పని చేస్తాడని వన్టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :