శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 27 జులై 2021 (11:23 IST)

జంట న‌గ‌రాలుగా సిరిసిల్ల‌, వేముల‌వాడ‌

రానున్న రోజుల్లో జంట నగరాలుగా కార్మిక (సిరిసిల్ల) , ధార్మిక ( వేములవాడ) క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, జెడ్పీ చైర్మన్ అరుణ, జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలతో కలిసి జిల్లా అధికారులతో కేటీఆర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

కోనరావుపేట మండలం ఎగ్లాస్ పూర్ బ్రిడ్జి కి నిధులు మంజూరు చేయడం జరిగిందని, నిర్మాణ ప్రగతిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. హన్మాజిపేట గ్రామంలో బ్రిడ్జి నిర్మించేలా ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని అన్నారు. వేములవాడలో ప్రగతిలో ఉన్న రెండో బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడలోని తిప్పాపూర్ జంక్షన్ ను అభివృద్ధి చేయాలని మంత్రి అన్నారు.
 
తెలంగాణా రాష్ట్రంలో ఒకప్పుడు త్రాగు నీరు, సాగు నీరు, విద్యుత్ సమస్యలు విరివిగా ఉండేవని, ఇప్పుడు ఎక్కడా కూడా ఇలాంటి సమస్యలు లేవని, ప్రత్యక్షంగా ప్రజలే ఈ వాస్తవాలు తెలుపుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూరదృష్టితో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని, దీని ద్వారా త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని మంత్రి అన్నారు. మిషన్ భగీరథలో భాగంగా మిగిలిన తుది దశ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత మిషన్ భగీరథ అధికారులను మంత్రి ఆదేశించారు. 
 
సిరిసిల్ల, వేములవాడ పట్టణాలలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి, అదనంగా అవసరమైన భూ సేకరణ చేసి మోడల్ కాలనీని నిర్మించేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు. ఆ దిశగా మున్సిపల్ అధికారులు పని చేయాలని అన్నారు. ధార్మిక, కార్మిక క్షేత్రాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అన్ని విభాగాల అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆదేశించారు. తద్వారా భవిష్యత్‌లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు.