బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (09:42 IST)

దొరగారి మాస్టర్ ప్లాన్ ఇదే.. విజయశాంతి సంచలన ట్వీట్

'ఎంఐఎం నేతలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దానిని కట్టడి చెయ్యకపోగా సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారని వార్తలు వస్తున్నాయి’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.
 
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ విజయశాంతి మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ప్రత్యర్థి పార్టీలను బరి నుంచి తప్పించేందుకు సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారంటూ ఓ ట్వీట్ చేశారు. ఇందుకు ఎంఐఎంతో కలిసి సీఎం కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
 
‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న టీఆరెస్ అధినేత కేసీఆర్ గారు ఎంఐఎం పార్టీతో కలసి కుట్రలు చేసి ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను చివరిక్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఎంఐఎం నేతలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దానిని కట్టడి చెయ్యకపోగా ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారని వార్తలు వస్తున్నాయి.

ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్ గారికి అలవాటుగా మారింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి రావడంతో ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ కుట్రలకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం సహించదు.. క్షమించదు" అని విజయశాంతి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.