గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జులై 2022 (10:43 IST)

ఆగస్టు 1 నుంచి షూటింగుల నిలిపివేత- నిర్మాతల మండలి

cinema theatre
హైదరాబాదులోని తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం నిర్మాతల మండలి తమ నిర్ణయాలపై ఓ ప్రకటన చేసింది. ఆగస్టు 1 నుంచి షూటింగుల నిలిపివేతకు సిద్ధమవుతున్న నిర్మాతల మండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది.  
 
నగరాలు, పట్టణాల్లో మామూలు థియేటర్లు, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.70, రూ.100గా ఉంచాలని తెలంగాణ ఫిలిం చాంబర్ ప్రతిపాదించినట్టు నిర్మాతల మండలి వెల్లడించింది. 
 
అదే సమయంలో, మల్టీప్లెక్స్‌లో రూ.125 ఉండాలని పేర్కొన్నట్టు తెలిపింది. మధ్యశ్రేణి హీరోలు, మీడియం బడ్జెట్ సినిమాల టికెట్ ధరలు నగరాలు, పట్టణాల్లో రూ.100 ఉండాలని, సి-క్లాస్ సెంటర్లలోనూ రూ.100 ఉండాలని, మల్టీప్లెక్స్ లలో గరిష్ఠంగా టికెట్ ధర రూ.150 ఉండాలని ప్రతిపాదించినట్టు వివరించింది. 
 
ఓటీటీలో పెద్ద సినిమాల స్ట్రీమింగ్ పైనా కీలక నిర్ణయం తీసుకున్నట్టు నిర్మాతల మండలి వెల్లడించింది. ఇక మీదట భారీ బడ్జెట్ సినిమాలను విడుదలైన 10 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాల్సి ఉంటుంది. 
 
పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు విడుదలైన 4 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలి. రూ.6 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాల విషయంలో ఫిలిం ఫెడరేషన్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 
 
అంతేకాదు, సినిమా షూటింగుల సమయంలో నటీనటులు తమ అసిస్టెంట్లకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేయడానికి వీల్లేదని నిర్ణయం తీసుకున్నారు. 
 
నిర్మాతలు కూడా బడ్జెట్ పై ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి నియామవళి పాటించాలని, బడ్జెట్ పెంచుకోవాలంటే ఫిలిం చాంబర్, నిర్మాతల మండలితో తప్పక చర్చించాలని నిర్ణయించారు. 
 
డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి కూడా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్)ను డిస్ట్రిబ్యూటర్లే చెల్లించాల్సి ఉంటుంది.