షర్మిల భర్త అనిల్ కుమార్‌ను కలిశానా? వంద శాతం ఫేక్ న్యూస్: రాజయ్య
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరికీ ఇవ్వని ప్రాధాన్యతను సీఎం కేసీఆర్ తనకు ఇచ్చారని తెలంగాణ రాష్ట్రసమితి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. తనకు ఇష్టమైన వైద్యారోగ్య శాఖను అప్పజెప్పారు. అడగకముందే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం కల్పించారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో టీఆర్ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన నేను పార్టీ విడిచే పరిస్థితే లేదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష.. రాజకీయంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కలుసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఒకవేళ కలుసుకున్నా దానిని రాజకీయం చేయొద్దని సూచించారు.
అలాగే సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు లోటస్ పాండ్‌లో షర్మిల భర్త అనిల్ కుమార్‌ను కలిసినట్టు వచ్చిన వార్తలు వాస్తవం కాదన్నారు. అది వంద శాతం ఫేక్ న్యూస్ అని, 2019 సంవత్సరంలో ఒక క్రైస్తవ సమావేశానికి ముందు అనిల్ కుమార్‌ను కలిసినప్పుడు దిగిన ఫోటోని ఇప్పుడు కలిసినట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్ పై నాకు అభిమానం ఉన్న మాట వాస్తవమే. వైఎస్ నాకు టికెట్ ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించారు. జగన్మోహన్ రెడ్డితో కూడా నా సావాసం గతంలో ఉండేది. సోనియాగాంధీ ప్రవర్తన వల్ల తెలంగాణ కోసం జగన్మోహన్ రెడ్డిని పక్కనబెట్టి బయటకు వచ్చాను. జగన్మోహన్ రెడ్డినా? తెలంగాణనా? అంటే తెలంగాణనే అని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు.