గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:39 IST)

భూ వివాదంలో చిక్కుకున్న తెరాస ఎమ్మెల్యే రసమయి - ఆడియో లీక్

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథిగా ఉన్న రసమయి... తన భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేయడమేకాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని కరీంపేట సర్పంచి మల్లయ్య సంచలన ఆరోపణలు చేశారు.
 
ఈ మేరకు ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణ ఆడియోను విడుదల చేశారు. తనకు మద్ధతుగా వచ్చిన తిమ్మాపూర్ మండలం మొగలిపాలెం మాజీ సర్పంచిపై పోలీసులతో దాడి చేయించారని మల్లయ్య ఆరోపించారు. ఎమ్మెల్యే బాలకిషన్ దౌర్జన్యాలు, వేధింపులు భరించలేక తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
 
కాగా, ఇటీవలే భూఅక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఈటెల రాజేందర్‌ను మంత్రి పదవి నుండి తొలగించడం.. ఆ తర్వాత ఈటెల పార్టీకి రాజీనామా చేయడంతో పాటు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, తర్వాత బిజెపిలో చేరడం, హుజురాబాద్ నియోజకవర్గం నుండి పోటీలో దిగడం చకచకా జరిగిపోయింది.