సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (17:18 IST)

కేంద్రం ఒక నియంతలా - నిరంకుశంగా పాలిస్తుంది.. మంత్రి కేటీఆర్

ktramarao
విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకు తెలంగాణ అధికార పార్టీ తెరాస సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే, ఆయనకు మద్దతు ప్రకటించడం వెనుకు అనేక కారణాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. 
 
కాగా, విపక్షాల మద్దతుతో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెరాస తరపున ఎంపీ నామా నాగేశ్వరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేటీఆర్‌ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ తరపున సంఘీభావం తెలిపిన అనంతరం యశ్వంత్‌ సిన్హాను హైదరాబాద్‌కు ఆహ్వానించినట్లు కేటీఆర్‌ తెలిపారు. 
 
ఈ నామినేషన్ ప్రక్రియ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ, 'యశ్వంత్‌ సిన్హాకు మద్దతు ఇచ్చేలా ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలా, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 ఏళ్లలో అప్రజాస్వామికంగా అన్యాయాల పరంపర కొనసాగుతోందన్నారు.
 
ఇప్పటివరకు దాదాపు 8 రాష్ట్రాల్లో భాజపాకు మెజారిటీ లేకపోయినా అక్కడి పరిస్థితులను తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఈ విషయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని భాజపా సద్వినియోగం చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని విపక్షాలపై ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. 
 
ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి పార్టీ దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే భాజపా ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తూ విపక్షాలు బలపర్చిన అభ్యర్థిని బలపరిచాం. అయితే అధికార ఎన్డీయే కూటమి ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌవది ముర్ము పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు' అని కేటీఆర్ స్పష్టం చేశారు.