కార్పొరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్లు మాఫీ.. స్టీల్ ప్లాంట్‌ను రక్షించలేరా : కేటీఆర్ లేఖ
దేశంలోని కార్పొరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక సాయం చేసి రక్షించలేదా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇదే విషయంపై ఆయన ఆదివారం కేంద్రానికి ఓ లేఖ రాశారు. ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన రాసిన లేఖలో గట్టిగా డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మంత్రి కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలి. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానాలి. వర్కింగ్ క్యాపిటల్, నిధుల సమీకరణ పేరుతో ప్లాంట్‌ను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పాలని ప్రయత్నిస్తున్నారు అని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా, కార్పొరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్లు మాఫీ చేశారని, అదే ఔదార్యం విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం కేంద్రమే ఆర్థిక సాయం చేయాలని, విశాఖ ప్లాంట్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.