ఏపీ సీఎం జగన్‌ నిర్ణయంతో కేసీఆర్ దిక్కులు చూస్తున్నారు... రాములమ్మ

Vijayasanti
Last Modified శుక్రవారం, 14 జూన్ 2019 (18:07 IST)
అధికార పార్టీలోకి ప్రతిపక్షంలో వున్న ఎమ్మెల్యేలు ఎవరయినా రావాలంటే, వారివారి పదవులకు రాజీనామాలు చేసి రావాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంతేకాదు... ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేనే లేదని తేల్చి చెప్పారు. దీంతో హౌసులోనే వున్న చంద్రబాబు నాయుడుకి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంపై ఇపుడు దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపులపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అంతా శభాష్ అంటున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా తెలంగాణలో 12 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారిని తెరాసలో చేర్చుకునేందుకు తెరాస బాస్ కేసీఆర్ ఉత్సాహం చూపించడంపై కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి మండిపడ్డారు.

బంగారు తెలంగాణ తెస్తా... దేశానికే ఆదర్శంగా నిలుస్తామంటూ చెప్పిన తెరాస ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని విమర్శించారు. స్పీకర్‌ను అడ్డు పెట్టుకుని పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంతో అంతా విస్తుపోయారనీ, చివరికి కోర్టు కూడా వారికి నోటీసులు ఇచ్చిందన్నారు. ఐతే పొరుగు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కేసీఆర్‌కి చెంపపెట్టులాంటివని వ్యాఖ్యానించారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని అసెంబ్లీలో తేల్చి చెప్పారనీ, దాన్ని చూసిన తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కేసీఆర్ చేస్తున్న పనులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారనీ, సమయం వచ్చినప్పుడు ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్తారని అన్నారు.దీనిపై మరింత చదవండి :