శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 7 జనవరి 2020 (13:50 IST)

జుట్టు రాలిపోయిందని యువకుడు ఆత్మహత్య...

అతని వయసు 18 ఏళ్లు. ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసి ప్రస్తుతం జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కొంతకాలంగా అతని తలవెంట్రుకలు రాలిపోతున్నాయి. చిన్న వయసులోనే బట్టతల వస్తుండటంతో మనోవేదన చెందిన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... మాదాపూర్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి కొండాపూర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివాసముంటున్నాడు. 
 
ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు ఎంబీఏ చదువుతుండగా, చిన్నకుమారుడు(18) జేఈఈ పరీక్షలకు ఇంటి వద్దే చదువుకుంటున్నాడు. ఇతనికి సైనస్‌ ఆరోగ్య సమస్యతో పాటు ఆరు నెలలుగా జట్టు రాలిపోవడం ఆరంభమై క్రమంగా బట్టతలగా మారింది. చిన్నవయసులోనే బట్టతల వస్తోందని మనోవేదన చెందేవాడు. ఈ విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రులకు సైతం చెప్పాడు. 
 
కాగా సోమవారం ఉదయం అతను స్నానాల గదికి వెళ్లి, ఎంత సేపటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి వెళ్లి చూడగా.. గడియపెట్టి ఉంది. ఆమె వెంటనే భర్తకు సమాచారం అందించింది. ఇంటికి వచ్చిన అతను స్నానాల గది తలుపులు పగులగొట్టి చూడగా కుమారుడు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బట్టతల సమస్యతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడు రాసిన లేఖ ఇంట్లో లభించింది. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.