తెలంగాణలో వైకాపా పార్టీ.. షర్మిలనే సీఎం అభ్యర్థి.. వీహెచ్ ఏం చెప్పారంటే?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ ఆరంభం కానుందనే సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణలో వైకాపా చీఫ్‌గా షర్మిలను సీఎం అభ్యర్థిగా నిలబెడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నాడన్నారు వీహెచ్.
షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశాడని ఆరోపించారు. షర్మిల ఒకవేళ పార్టీ పెట్టదలిస్తే ఏపీలోనే కొత్త పార్టీ పెట్టడం మేలన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని వీహెచ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయని, ఏపీలో అయితే జగన్ వ్యతిరేకులు షర్మిల వెంట వస్తారని చెప్పారు. జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే షర్మిల ఏపీలోనే పార్టీ పెట్టుకోవాలని వీహెచ్ సూచించారు.
ఇప్పటికే టీడీపీ నేత పట్టాభి కూడా షర్మిల పార్టీపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తమనకు సమాచారం ఉందన్నారు. టీ కాంగ్రెస్ నేత వీహెచ్ షర్మిల పార్టీపై స్పందించడంతో ఈ టాపిక్ మారింత హాట్‌గా మారింది.
కాగా.. తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ వైఫల్యాలతో సీఎం కేసీఆరే రాష్ట్ర రాజకీయాల్లోకి షర్మిలను తీసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతున్న వేళ ప్రత్యర్థి ఓట్లను చీల్చేందుకు కేసీఆర్ ఈ వ్యూహం రచించినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. ఉస్మానియా యూనివర్సిటీ సహా పలుచోట్ల కొంతమంది విద్యార్థులు,వ్యక్తులు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం బలమైన రాజకీయ శక్తిగా ఉండటం.. హైదరాబాద్ లాంటి చోట్ల ఇప్పటికీ వైఎస్ అభిమానం ఘనం భారీగానే ఉన్న నేపథ్యంలో... తెలంగాణలో పార్టీ దిశగా షర్మిల ఆలోచన చేసే ఆస్కారం లేకపోలేదు. అయితే అన్నను ధిక్కరించి ఆమె పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం మాత్రం సత్య దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తన చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ వ్యాఖ్యానాలు,చర్చలపై షర్మిల స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.