ప్రధానిని రాకను చూసి పక్క రాష్ట్రానికి పారిపోయిన కేసీఆర్ : వైఎస్ షర్మిల
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దెబ్బకు భయపడి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్క రాష్ట్రానికి పారిపోయారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ నగరానికి ప్రధాని మోడీ వచ్చిన విషయం తెల్సిందే. ప్రధాని నగరానికి వచ్చిన వెళ సీఎం కేసీఆర్ బెంగుళూరు పర్యటనకు వెళ్లిపోయారన్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ,
"ఢిల్లీ కోటలు బద్ధలు కొడతాం. కడిగిపారేస్తాం.. ఏకిపారేస్తాం అన్న కేసీఆర్ సారూ.. మోడీ ఇక్కడకు వస్తే మీరెక్కడికి పారిపోయారు? అంటూ షర్మిల ప్రశ్నించారు. "మా తెలంగాణ ధాన్యం ఎందుకు కొనవు? మద్దతు ధర ఎందుకు ఇవ్వవు అని ఏకిపారేయలేకపోయావా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్టుగా మోడీ గారొస్తే పిరిగివాడిలాగా పారిపోతావా? అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
"కేసీఆర్ పాలన అవినీతి మయం అని మోడీ చెబుతారు. మోదీ అవినీతి చిట్టా తన దగ్గర ఉందని కేసీఆర్ చెబుతారు. కానీ ఇద్దరూ ఎదురుపడరు. ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టుకోరు. జనాన్ని మాత్రం పిచ్చోళ్లను చేస్తారు. మీవన్ని ఉడుత ఊపు ప్రసంగాలేనా? అని షర్మిల నిలదీశారు.