శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (12:09 IST)

చిరంజీవి క్రేజ్‌కి తగినట్టుగా 'లూసిఫర్' కథలో మార్పులు?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదాపడింది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి "లూసిఫర్" అనే మలయాళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం హక్కులను చిరంజీవి తనయుడు, హీరో రాం చరణ్ కొనుగోలు చేశారు. 
 
ఈ చిత్రాన్ని రాం చరణ్‌తో పాటు యూవీ నిర్మాణ సంస్థ కలిసి నిర్మించనున్నారు. ఆచార్య షూటింగ్ ముగిసిన తర్వాత 'లూసిఫర్' ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అలాగే ఈ చిత్రానికి "సాహో" దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ఆయన ఇప్పటికే ఈ పనుల్లో నిమగ్నమైవున్నారు. పైగా, చిరంజీవి క్రేజ్‌కు తగ్గట్టుగా, తెలుగు నెటివిటీకి అనుగుణంగా ఈ చిత్ర కథలో భారీ మార్పులు చేస్తున్నట్టు సమాచారం. 
 
నిజానికి మలయాళంలో ఈ చిత్రంలో స్టార్ హీరో మోహన్ లాల్ నటించారు. ఆయనకు మాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ వేరు. పైగా, అక్కడి ప్రక్షకుల అభిరుచివేరు. అందువల్ల కథను తెలుగు నేటివిటీకి దగ్గరగా.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా తీసుకొచ్చేలా డైరక్టర్ సుజిత్ మార్పులు, చేర్పులు చేస్తున్నారు. 
 
ప్రధానంగా, చిరంజీవి క్రేజ్‌కి తగినట్టుగా.. ఆ పాత్ర స్వరూప స్వభావాలను ఆయన మరింతగా తీర్చిదుద్దుతున్నాడని చెబుతున్నారు.  మరోవైపు, చిరంజీవి.. కొరటాల దర్శకత్వంలో చేస్తున్న 'ఆచార్య' దీపావళి పండుగకి గానీ, క్రిస్మస్‌కిగాని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలన్న తలంపులో ఉన్నట్టు వినికిడి.