శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 మార్చి 2020 (18:00 IST)

'ముఖ్యమంత్రి'గా పవన్ కళ్యాణ్... ప్లాన్ చేస్తున్న 'బద్రి' దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ రీఎంట్రీ తర్వాత ఆయన దూకుడు మామూలుగా లేదు. వరుసబెట్టి సినిమాలు అంగీకరిస్తున్నారు. ఇప్పటికే పింక్ రీమేక్‌లో పవన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే మరో రెండు చిత్రాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇపుడు మరో చిత్రంలో నటించేందుకు సమ్మతం తెలిపారు. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా, ఈచిత్రం టైటిల్ కూడా ముఖ్యమంత్రి అని ఖరారు చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
నిజానికి పవన్ కల్యాణ్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌ ఎంతో ప్రత్యేకమైనది. పవన్ కల్యాణ్‌ 'బద్రి'తోనే పూరి జగన్నాథ్ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ 'బద్రి' తర్వాత 12 యేళ్ళకు వీరిద్దరి కలయికలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' వచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పవన్-పూరి కలసి పనిచేయబోతున్నారట. ఇందులో పవర్‌స్టార్‌ని ముఖ్యమంత్రి పాత్రలో చూపించబోతున్నాడట. 
 
గతంలో హీరో మహేశ్‌ బాబుతో 'జనగణమణ' పేరుతో సినిమా పూరీ ఓ సినిమా తీసేందుకు ప్లాన్ చేశాడు. కానీ, ఈ చిత్రాన్ని పూర్తి చేయడంలో మహేష్ బాబు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇపుడు ఈ కథనే పవన్ కళ్యాణ్‌కి పూరి వినిపించాడట. అందులో కథానాకుడు ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. పవన్ ప్రస్తుతం 'వకీల్ సాబ్'తో బిజీగా ఉన్నాడు. దాని తర్వాత ఇప్పటికే పట్టాలెక్కిన క్రిష్ మూవీ లైన్‌లో ఉంది. ఆ తర్వాత హరీశ్ శంకర్-మైత్రీ మూవీ మేకర్స్‌ సినిమా ఉంటుంది. ఆ తర్వాతే పవన్-పూరి మూవీ ఉండే ఛాన్స్‌ ఉందట. ఇప్పటికే మూడు సినిమాలను అధికారికంగా ప్రకటించిన పవన్ పూరి సినిమాపై క్లారిటీ ఇవ్వాల్సివుంది.