బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

jani master
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్టు ప్రచారం జరుగుతుంది. ఈయన ప్రస్తుతం దక్షిణాదిలో సైతం టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లోని స్టార్ హీరోల పాటలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల కేంద ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ కూడా అందుకున్నారు. కెరీర్ ఇలా పీక్ స్టేజ్‌లో సాగుతూ ఉండగా జానీ మాస్టర్‌పై ఓ మహిళ లైంగిక వేదింపుల కేసు పెట్టింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని జానీ దగ్గర పని చేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్  పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవుట్‌డోర్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లోవెళ్ళినప్పుడు తనపై అత్యాచారం చేసాడని.. అలాగే హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం  నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. జానీ మాస్టర్‌పై అతనిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఇక జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున పలు చోట్ల విస్తృత ప్రచారం నిర్వహించారు. జనసేన కార్యకర్తగా కొనసాగుతున్నారు. గతంలో కూడా ఇదే తరహా ఆరోపణలు వస్తే అవి తప్పని రూపితమయ్యాయి. ఇపుడు మరోమారు ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది.