గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 13 జనవరి 2020 (22:19 IST)

మన్మథుడు నాగ్‌కు ఎన్ని కష్టాలొచ్చాయి..?

టాలీవుడ్‌ సీనియర్ హీరోలకు హీరోయిన్‌ కష్టాలు తప్పటంలేదట. సీనియర్‌ హీరోయిన్లతో జతకట్టేందుకు హీరోలు నో చెప్తుంటే ఏజ్‌ బార్‌ హీరోల సరసన నటించేందుకు అందాల భామలు నో అనేస్తున్నారట. ముఖ్యంగా నాగార్జున లాంటి హీరోలకైతే ఇబ్బందులు మరింత ఎక్కువవుతున్నాయట. 
 
ఇటీవల వెంకటేష్‌, బాలకృష్ణ లాంటి హీరోల విషయంలో ఈ సమస్య ప్రధానంగా తెర మీదకు వచ్చింది. అనుష్క, నయనతార లాంటి హీరోయిన్స్‌ సీనియర్లతో నటించేందుకు సిద్ధంగా ఉన్నా వారి డేట్స్‌ అడ్జస్ట్‌ అవ్వటం కష్టంగా మారింది. తాజాగా మరో సీనియర్ హీరో నాగార్జున కూడా హీరోయిన్ల సమస్య తలెత్తిందట.
 
సీనియర్‌ హీరోల్లో ఇప్పటికే గ్లామరస్‌గా మన్మథుడు ఇమేజ్‌తో కనిపిస్తున్న నటుడు కింగ్‌ నాగార్జున. ఇప్పటికీ రొమాంటిక్‌ రోల్స్‌ చేస్తున్న నాగ్‌ మన్మథుడు-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా యంగ్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌ సింగ్‌ నటించింది. కానీ ఈ సినిమా ఫలితం తేడా కొట్టేయటంతో నెక్ట్స్ సినిమా విషయంలో నాగ్‌ ఆలోచనలో పడ్డాడు.
 
ప్రస్తుతం నాగార్జున ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వైల్డ్ డాగ్. ఈ సినిమాలో నాగ్ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా నటించే హీరోయిన్‌ కోసం చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా నటించేందుకు అందాల భామలెవరు రెడీగా లేరన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు హీరోయిన్లు నో కూడా చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో సీనియర్ కథానాయకులకు హీరోయిన్‌ను వెతకటం దర్శక నిర్మాతలకు తలకు మించిన భారంగా మారుతోందన్న ప్రచారం సినీపరిశ్రమలో జోరుగా సాగుతోంది.