మా - గొడవలకు ఇద్దరు బాబుల దుందుడుకు తనమే కారణమా! - సర్వే రిపోర్ట్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పదేళ్ళుగా లేని హడావుడి ఈసారి కనిపిస్తుంది. చాలాసార్లు పోటీదారులైన ఇరు పానల్‌లు తాము అది చేస్తాం ఇది చేస్తాం అంటూ మేనిఫెస్టోతోపాటు గతంలో జరిగిన కమిటీ లొసుగులను తూర్పూరపడుతూ వుండడం సహజమే. ఫైనల్‌గా ఎవరు గెలిస్తే వారి తరఫున పోటీ వర్గం కూడా కలిసిపోయి అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిణామాలు వుంటాయి. కానీ ఈసారి కేవలం లోకల్ నాన్ లోకల్ అనే అజెండా మాత్రమే తెరముందుకు వచ్చింది. మేనిఫెస్టోలు అమలు చేయడం, చేయకపోవడం అనేది పెద్ద సమస్యకాదు. గతంలో వున్న కమిటీ ఎన్ని అజెండాలోని అమలు చేశారనేది ప్రతి సభ్యుడికీ తెలిసిందే.
ప్రతిసారీ ఆనవాయితీగా మెగా కుటుంబం నుంచి నాగబాబు రేపు ఎలక్షన్ అనగా ముందురోజు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మేం పలానా పేనల్‌కు మద్దతు ఇస్తున్నాం ఓటు వేయమని చెబుతుంటారు. తెల్లారి ఎలక్షన్లలో ఆయన బలపరిచిన అభ్యర్థి పేనల్ గెలుస్తుంది. కానీ ఈసారి అలా లేదు. అందుకు కారణం కేవలం నాన్ లోకల్ ప్రకాష్‌రాజ్ అనే వ్యక్తి బరిలో దిగడమే కారణంగా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 920 మంది మా సభ్యుల్లోనూ ముప్పావువంతు ప్రకాష్‌రాజ్‌కు సపోర్ట్‌గా నిలవడం లేనదేది బహిరంగ రహస్యమే. కానీ కేవలం మెగా ఫ్యామిలీ సపోర్ట్ వుండడంతో ఆశ్చర్యపడడం మినహా వారు చేసేది ఏమీలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసేసరికి తప్పని తెలిసినా తప్పట్లేదని నానుడి ఫిలింనగర్‌లో బాగా వినిపిస్తోంది. అందుకే మాకు ఓటు వేస్తే మేం వేషాలు ఇప్పిస్తాం. మాకు ఓటు వేస్తే సభ్యులకు మంచి చేస్తామంటూ ప్రకటించాల్సి వచ్చింది.
అయితే లోకల్ నాన్ లోకల్ విషయంలో నాగబాబు శుక్రవారంనాడు విడుదలచేసిన ఆడియో టేప్‌లో దుందుడుకుగానే మాట్లాడిన విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది. మోడీనుంచి కెసిఆర్ వరకు అందరినీ టచ్ చేస్తూ, అసలు కెసిఆర్ ఎక్కడివాడు. ఆయన్ను .. అంటూ ఓ పదాన్ని వాడి.. పూర్తిగా పలకకుండా తమాయించుకుని.. ఆయన గెలిచాడు కదా. చాలా సేవ చేశారు కదా. రాష్ట్రంను ఏర్పాటు చేసుకున్నారు కదా! అంటూ పాజిటివ్‌గా మలుచుకున్నారు. కానీ అప్పటికే ఆయన ఆడియో చేరాల్సిన వారికి చేరిపోయింది. కానీ మోహన్‌బాబు ఎక్కడా ఏ రాజకీయ పార్టీని కానీ నాయకులను కానీ వేలెత్తి చూపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.
పైగా. వై.ఎస్. జగన్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా మోహన్‌బాబుపై ముద్ర వుంది. ఆయనే ఎలాగైనా మంచు విష్ణును గెలిపించాలని ఆమధ్య ఆన్‌లైన్ టికెట్ల సందర్భంగా అమరావతిలో కలిసినవారితో అన్యాపదేశంగా చెప్పాడనే టాక్ కూడా ప్రచారం జరిగిపోయింది. కనుకనే మోహన్‌బాబు అంత ధీమాగా వుండడమేకాకుండా రాజకీయపార్టీ ఎలక్షన్ల సందర్భంగా చేస్తున్న పద్ధతిని పోస్టల్ బేలట్ అనేది తెరముందుకు తెచ్చాడని తెలుస్తోంది. ఏది ఏమైనా కేవలం 900 పైచిలుకు వున్న సభ్యుల మధ్య ఇంత ఇగోలు వుంటే రాష్ట్రం, దేశం పాలించే వారు ఎలా వుంటారో అనేది ఇప్పుడు తెలుస్తుందని పలు చిత్రాల షూటింగ్‌లో వున్న ప్రతి శాఖ వారూ చర్చించుకోవడం కనిపించింది. ఏదిఏమైనా దుందుడుకుగా మాట్లాడడం అసలుకే మోసంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. అందుకే ఇద్దరు బాబుల మధ్య పోరును సోషల్‌మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తోంది.