శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (14:04 IST)

'2.O' ఫాదర్ ఆఫ్ ఆల్ మూవీస్.. సీక్వెల్‌గా 3.O.. చిట్టి స్థానంలో కుట్టి? శంకర్ హింట్

సూపర్ స్టార్ రజనీకాంత్ - బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో శంకర్ తెరకెక్కించిన చిత్రం "2.O". ఈ చిత్రం నవంబరు 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రానికి సీక్వెల్‌గా "3.O" పేరుతో మరో చిత్రం రాబోతుందనే ప్రచారం అపుడే మొదలైంది. అలాగే, రోబో, 2.O చిత్రాల్లో అత్యంత కీలకమైన పాత్రల్లో ఒకటైన చిట్టి స్థానంలో కుట్టి రాబోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 2పాయింట్O చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీకి హిట్ టాక్ రావ‌డంతో టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అనేక థియేటర్లలో బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఈ చిత్రానికి సామాజిక అంశాన్ని జోడించి తెర‌కెక్కించిన శంక‌ర్ మ‌రో సీక్వెల్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు 2.O సినిమా చూసిన వారికి అర్థమ‌వుతోంది. 
 
చిట్టి స్థానంలో కుట్టి అనే సూపర్ హ్యూమనాయిడ్ రోబో ఉంటుందని హింటిస్తూ 2.O సినిమాను ముగించడంతో అభిమానులు ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు క‌థ‌లు అల్లేసుకుంటున్నారు. మ‌రి ఇదే క‌నుక నిజ‌మైతే శంక‌ర్ మూడో పార్ట్ ర‌జ‌నీకాంత్‌తోనే తీస్తాడా? లేదంటే మ‌రో స్టార్‌ని ఎంచుకుంటాడా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 
 
కాగా, గురువారం రిలీజైన '2.O' చిత్రం నిజంగా ఓ అద్భుత‌మైన విజువ‌ల్ వండ‌ర్‌లా ఉంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. '2.O'కు, పక్షిరాజాకు మధ్య జరిగే యుద్ధాన్ని శంక‌ర్ చాలా అద్భుతంగా చూపించార‌ని చెప్పుకొస్తున్నారు. ఐదు భాష‌ల‌లో విడుద‌లైన 2.O చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.