శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (19:17 IST)

ఒక్క‌ ఫైట్ లేకుండా యాక్షన్ సినిమా చేయొచ్చు- శరత్ మండవ

Sarath Mandava
Sarath Mandava
మాస్ మహారాజా రవితేజ సినిమాలంటేనే యాక్ష‌న్, ఎంట‌ర్‌టైన‌ర్‌. అలాంటిది ఒక్క‌ ఫైట్ లేకుండా యాక్షన్ సినిమా చేయొచ్చు అని ద‌ర్శ‌కుడు శరత్ మండవ తెలియ‌జేస్తున్నారు. ఆయ‌న తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం  'రామారావు ఆన్ డ్యూటీ'.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణం రూపొందింది. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమౌతున్న నేపధ్యంలో దర్శకుడు శరత్ మండవ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
 
రవితేజ ఏం డ్యూటీ చేయబోతున్నారు ?
'రామారావు ఆన్ డ్యూటీ' రవితేజ లాంటి మాస్ స్టార్ చేస్తున్న లార్జర్ దెన్ లైఫ్ ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్. ఒక మిస్సింగ్ కేసుని పోలీసులు, లేదా క్రైమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. కానీ సివిల్ ఆఫీసర్ గా రామారావు ఈ కేసుని ఎందుకు డీల్ చేశాడనేది ఇందులో చాలా యునిక్ పాయింట్.
 
కథలో ఇసుక మాఫియా కీలకంగా ఉంటుందా ?
ప్రత్యేకంగా ఇసుక మాఫియా అని లేదు. కలెక్టరేట్ తో ముడిపడిన విభాగాలన్నీటికీ చాలా వ్యవస్థలపై ప్రత్యేక అధికారాలు వుంటాయి. కోర్టులు పని చేయనప్పుడు కలెక్టరేట్ కు ఆదేశాలు ఇచ్చే హక్కు వుంటుంది. కథలో ఆ సీన్ కి సంబధించిన అంశం వచ్చినపుడు దాని గురించి కొంత చెప్పడం వుంటుంది.
 
రామారావు ఆన్ డ్యూటీ కథ ఎప్పటినుండి మీ ఆలోచనలో వుంది ?
కథలు ఎప్పుడూ మనసులో తిరుగుతూనే వుంటాయి. కొన్ని పరిణితి చెందుతుంటాయి. ఏదో ఒక హుక్ పాయింట్ దొరికినప్పుడు పూర్తిగా రాసేస్తాం. ఇది కూడా నాలుగేళ్ల క్రితం నుండి వున్న ఆలోచన. రవితేజ గారు కథ లోకి వచ్చిన తర్వాత ఆయన ఇమేజ్ కి తగ్గకొన్ని మార్పులు చేయడం జరిగింది.
 
ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ఎక్కువగా వుంది. కానీ రవితేజ గారు అంటే ఆడియన్స్ ఎంటర్ టైన్మెంట్ అని ఆశిస్తారు.. ఇందులో అది ఎంత శాతంలో వుంటుంది ?
ఎంటర్ టైన్మెంట్ అంటే కామెడీ అని నేను అనుకోవడం లేదు. ఆడియన్స్ ని యంగేజ్ చేయడమే ఎంటర్ టైన్మెంట్. ఇందులో ఫన్ ఫ్యాక్టర్ కూడా వుంటుంది.
 
రవితేజ సినిమా అంటే మాస్ ఎంటర్ టైన్మెంట్.  అందులో కూడా కొత్తదనం కోరుకుంటారు ఆడియన్స్. రామారావు ఆన్ డ్యూటీ లో వున్న కొత్తదనం ఏమిటి?
కథ చాలా యునిక్ గా వుంటుంది. పాత్ బ్రేకింగ్ కథ అని చెప్పను కానీ చాలా డిఫరెంట్ గా వుంటుదని మాత్రం చెప్పగలను. రవితేజ గారి గత సినిమాల ఛాయలని రిపీట్ కాకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను.
 
2016 లో వచ్చిన మీ మొదటి సినిమా కేఓ 2 తర్వాత ఇంత విరామం రావడానికి కారణం ?
కేఓ 2 తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే పెద్ద హీరోలకు ఎప్పుడూ ఒక లైనప్ వుంటుంది. ఆ లైన్ లో ఏదైనా డ్రాప్ అయితే మన సినిమా ముందుకు వస్తుంది. మధ్యలో విశాల్ గారితో ఒక ప్రాజెక్ట్ చర్చలు జరిగాయి. తర్వాత కరోనా వచ్చింది.   రామారావు ఆన్ డ్యూటీ కూడా చాలా రోజుల క్రితమే రవితేజ గారి చెప్పాను.
 
'' రామారావు ఆన్ డ్యూటీ '' టైటిల్ గురించి చెప్పండి ?
రామారావు అనేది పవర్ ఫుల్ పేరు. ఆ పేరుకి పరిచయం అవసరం లేదు. పెద్దాయన లేకపోయినా ఒక సర్వే పెడితే నెంబర్ వన్ తెలుగు పర్సనాలిటీ గా ఆయన పేరు వచ్చింది.  తర్వాత అదే పేరుతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్ హీరో. అలాగే కేటీఆర్ గారు కూడా గ్రేట్ లీడర్. ''రామారావు' అనేది ఒక స్ఫూర్తిని నింపే వ్యక్తిత్వం. అందుకే ఈ పాత్రకు రామారావు అని పేరు పెట్టాను.
 
వేణు తొట్టంపూడి గారు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?
ఇందులో చాలా కీలకమైన సిఐ పాత్ర వుంది. ఈ పాత్రకు ఎవరైతే బావుంటుదని ఆలోచిస్తున్నప్పుడు వేణు గారు స్ట్రయిక్ అయ్యారు. ఆయన సినిమాలు, వీడియోలు ఇప్పటికీ చాలా పాపులర్. సోషల్ మీడియాలో కనిపిస్తూనే వుంటాయి. స్వయంవరం లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన హీరో వేణు గారు. ఈ పాత్రకు ఆయన అయితే బావుంటుదని వెళ్లి ఆయన్ని కలిశాను. లక్కీగా ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. ఎమోషన్స్ ని అద్భుతంగా పడించే నటుడాయన. రామారావు ఆన్ డ్యూటీలో ఆయన పాత్ర చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది.
 
నిర్మాతల సహకారం ఎలా వుంది ?
సుధాకర్ చెరకూరి, శ్రీకాంత్ గారు అద్భుతమైన నిర్మాతలు. మంచి సినిమా చేయాలనే తపనతో వుంటారు. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితిలో కూడా ఈ సినిమాని ఇంత గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం వారి గొప్ప సంకల్పం వలనే సాధ్యమైయింది. సినిమాని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. 
 
ఇది యధార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన చిత్రమా ?
అవును.. కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా సినిమా రూపొందించాం. అందులో ఒక సంఘటన నా అనుభవంలో కూడా వుంది.
 
రజిషా విజయన్ ని తీసుకోవాలని ఎలా అనిపించింది ?
మాళిని పాత్రకు గ్లామర్ కంటే ఎమోషనల్ కోషియంట్ ఎక్కువ వుండే ఒక యునిక్ నటి కావాలనిపించింది. రజిషా విజయన్ ఆ పాత్రకు సరిగ్గా నప్పుతుందని అనిపించింది. మొదట ఆమె ఒప్పుకోలేదు. కథ పూర్తిగా చెప్పిన తర్వాత ఆమెకు చాలా నచ్చింది. చేసిన తర్వాత నా పాత్రకి సంబధించిన సీన్లు ఏమైనా డిలిట్ చేస్తారా అని అడిగింది. అలాంటిది ఏమీ వుండదని హామీ ఇచ్చాను( నవ్వుతూ)
 
ఇందులో ఐదు మంది స్టంట్ మాస్టర్లని పెట్టడానికి కారణం ?
ఇందులో ఫైట్లు అన్నీ కథలోనే వస్తాయి. నిజానికి పెద్ద స్టంట్ మాస్టర్లు మల్టిఫుల్ ఒప్పుకోరు. కానీ నేను రిక్వస్ట్ చేశాను. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లని డిజైన్ చేశారు.
 
సంగీత దర్శకుడు సామ్ సిఎస్ గురించి ?
విక్రమ్ వేద లో సామ్ సిఎస్ వర్క్ అద్భుతంగా వుంటుంది., ఖైదీ సినిమా చూసిన తర్వాత నే రవితేజ గారికి ఫోన్ చేసి సామ్ సిఎస్ ని అనుకుంటున్నాని చెప్పాను. రవితేజ గారికి కూడా సామ్ అంటే అప్పటికే గురి వుంది. సామ్ ని ఇక్కడి పిలించి ప్రాజెక్ట్ గురించి చెప్పాను. మేము మొదట లాక్ చేసిన టెక్నిషియన్ సామ్ సిఎస్. 
 
సీసా పాట గురించి ?
సీమ ప్రాంతంలో 'కులుకు భజన' చాలా పాపులర్. ఈ కాన్సెప్ట్ ని పెట్టాలని భావించాను. దానిని ఇంకా కాస్త వినోదాత్మకంగా ఉండేలా కొన్ని ట్యూన్స్ అనుకున్నాం. చంద్రబోస్ గారిని కలిసి ఈ కాన్సెప్ట్ ని చెప్పా. ఆయన కొంత సమయం తీసుకొని సీసా పాటని రాశారు.
 
2 గంటల30 నిమిషాల రన్ టైమ్ వచ్చింది. ఆడియన్స్ ని యంగేజ్ చేయగలరని భావిస్తున్నారా ?
కథని బలంగా నమ్ముతాను. కథ నుండి పక్కకు వెళ్ళను. నా వరకూ కథ ఒక దేవాలయం లాంటింది. దానికంటూ ఒక నిర్మాణం వుంటుంది. లెజండరీ దర్శకులు దాసరి నారాయణ రావు గారి మాటలు నాకు స్ఫూర్తి. ''ఒక కథ రాసేటప్పుడు ఆ కథే తనకు కావాల్సిన అన్ని సమకూర్చుకుని పూర్తి చెసుకుంటుంది. హిట్, ఫ్లాప్ మన చేతిలో లేదు, మంచి చెడు మాత్రం మన చేతిలో వుంటుంది'' దాసరి గారు చెప్పిన ఈ మాటలు లైఫ్ టైం పాటిస్తాను. నేను టీం వర్క్ ని నమ్ముతాను. ఈ చిత్రంలో అద్భుతమైన టీమ్ వర్క్ వుంది.
 
ఏ జోనర్ లో మీకు బలం ఎక్కువని భావిస్తున్నారు ?
నా బలం ఏమిటో తెలీదు కానీ.,.నా బలహీనత తెలుసు. శేఖర్ కమ్ముల గారి లాంటి సినిమాలు చేయలేను. లైటర్ వెయిన్ ఎమోషన్స్ ని డీల్ చేయడం నా వరకూ కష్టం.  యాక్షన్, థ్రిల్లర్స్ చేయగలను. ఒక ఫైట్ లేకుండా కూడా యాక్షన్ సినిమా చేయొచ్చు. రాజ్ కుమార్ హిరాణీ తరహాలో ఒక కథ రాసుకున్నా అని తెలిపారు.