సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!
తనతో సహజీవనం చేస్తూ, తనతో కలిసి నటిస్తున్న సహచర నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందడాన్ని తట్టుకోలేకపోయిన నటుడు చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చంద్రకాంత్, పవిత్రలు "త్రినయని" అనే టీవీ సీరియల్‌లో నటిస్తూ వచ్చారు. అయితే, ఈ నల 12వ తేదీన హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర తీవ్రంగా గాయపడి మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాద సమయంలో కారులో పవిత్ర చెల్లి అక్షర, కారు డ్రైవర్ శ్రీకాంత్, చంద్రకాంత్‌లు కూడా ఉండగా, వీరు గాయాలతో ప్రాణాల నుంచి తప్పించుకున్నారు.
ఈ క్రమంలో పవిత్ర మృతిని చంద్రకాంత్ తట్టుకోలేక పోయాడు. ఆమె చనిపోయినప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. డిప్రెసన్‌కు లోనయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి పవిత్ర - చంద్రకాంత్‌లు కలిసి ఒకే ఇంటిలో ఉంటూ సహజీవనం చేస్తూ వచ్చారు. చంద్రకాంత్ వివాహితుడు అయినప్పటికీ ఆయన భార్యకు దూరంగా ఉంటూ పవిత్రతో కలిసి ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో దూరం కావడంతో ఆయన జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.