సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (17:25 IST)

తాగుతూ టైమ్ గడిపేద్దామనుకున్నా... కానీ.. జగపతిబాబు

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం బంద్ అయింది. కేవలం నిత్యావసర వస్తు సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సినిమా షూటింగులన్నీ బంద్ అయ్యాయి. దీంతో పలువురు సెలెబ్రిటీలు ఈ లాక్‌డౌన్ సమయంలో తమతమ ఇళ్ళలో ఎలా గడుపుతున్నారనే విషయంపై చిన్నచిన్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అవి వైరల్ కావడం మనం చూశాం. 
 
ఇలాంటి సెలెబ్రిటీలలో హీరో కమ్ విలన్ జగపతిబాబు కూడా లాక్‌డౌన్ సమయాన్ని ఏవిధంగా గడపాలన్న విషయంపై ఎలా తర్జనభర్జనలు పడ్డారో తాజా ఓ వీడియో రూపంలో వివరించారు. 
 
ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 21 రోజుల పాటు లాక్‌డౌన్ పొడగిస్తున్నట్టు ప్రకటించారు. అపుడు తనకు ఏం చేయాలో అర్థంకాలేదన్నారు. ప్రతి రోజూ పనికెళ్తూ, ప్రతిరోజూ సంపాదిస్తూ వచ్చాం. కానీ, ఇపుడు ఏం చేయాలన్న అంశం తనను ఆలోచింపజేసిందన్నారు. 
 
ఆ ఆలోచనల్లో భాగంగా తొలుత సాయంత్రం పూట మద్యం సేవిస్తూ ఓ నాలుగు గంటల సమయాన్ని గడిపేయొచ్చు అని భావించాను. కానీ, మద్యం తాగుతూ గడపడం అనేది మంచిదికాదన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు. పైగా, ఇది నెగెటివ్ ఆలోచన అని చెప్పారు. 
 
అలాగే, చాలామంది ఒక పని చేయడానికి టైమ్ లేదు టైమ్ లేదు అంటుంటారనీ, అలాంటివారందరికీ ఇది సరైన సమయమన్నారు. ప్రకృతి మనకు కల్పించిన అవకాశమని, ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా ఆలోచన చేస్తూ, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంటిపట్టునే ఉంటూ తమతమ పనులు చేసుకోవాలని సలహాఇచ్చారు.