సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 జనవరి 2025 (17:06 IST)

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

ajit kumar
కోలీవుడ్ హీరో అజిత్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. భారత 76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని శనివారం రాత్రి ఈ అవార్డుల ప్రకటన చేసింది. ఇందులో తనకు పద్మభూషణ్ ఇవ్వడంపై అజిత్ ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. 
 
'పద్మభూషణ్ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. ఎంతోమంది సమష్టి కృషి మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నా. సినీ పరిశ్రమలో ఎంతోమంది నాకు సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. 
 
వారందరి ప్రేరణ, సహకారం, మద్దతు కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఎన్నో ఏళ్లుగా రేసింగ్, షూటింగులో నాకు సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు. ఈ రోజును చూసేందుకు నా తండ్రి జీవించి ఉంటే ఎంతో బాగుండేదనిపిస్తోంది. నన్ను చూసి ఆయన గర్వపడేవాడు. భౌతికంగా మా మధ్య లేకపోయినా.. నేటికి ఆయన నాతోనే ఉన్నాడని అనుకుంటున్నాను' అని పేర్కొన్నారు. 
 
అలాగే, '25 ఏళ్ల నుంచి నా భార్య షాలిని సహకారంతోనే ఇలా ఉన్నాను. నా విజయానికి, సంతోషానికి ఆమె ప్రధాన కారణం. చివరగా నా అభిమానుల గురించి చెప్పాలి. మీ అంచంచలమైన ప్రేమ, మద్దతు కారణంగానే నేను అంకితభావంతో పనిచేయగలుగుతున్నా. ఈ అవార్డు మీ అందరిది. మీ అందరికీ వినోదాన్ని అందించడానికి ఇలానే కష్టపడతాను' అని ఆనందం వ్యక్తం చేశారు.