శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (10:32 IST)

పొగాకు బ్రాండ్ ప్రచారకర్తగా తప్పుకున్న అక్షయ్ కుమార్

Akshay kumar
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన అభిమానులతో పాటు ప్రేక్షకులను క్షమించమని వేడుకున్నారు. విమల్ పొగాకు బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. విమల్ పొగాకు కంపెనీ తయారు చేసే మసాలా బ్రాండ్లకు అక్షయ్ కుమార్ ప్రచారకర్తగా నియమితులయ్యారు. అయితే, దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు తలొంచిన అక్షయ్ కుమార్ ఈ మసాలా బ్రాండ్‌కు ప్రచారకర్త నుంచి తప్పుకుంటున్నట్టు ప్రటించారు. 
 
ఈ తరహా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా షారూక్ ఖాన్, అజయ్ దేవగణ్ ఉండగా తాజాగా అక్షయ్ కుమార్ చేరారు. అయితే, అక్షయ్ కుమార్ నిర్ణయాన్ని ఆయన అభిమానులు స్వాగతించడం లేదు. తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో అక్షయ్ కుమార్ వెనక్కి తగ్గి, ఇన్‌స్టా ఖాతాలో అభిమానులను ఉద్దేశించి ఓ సందేశం పంపించారు. 
 
'నన్ను క్షమించండి. అభిమానులకు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రతిస్పదంన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇకపై  పొగాకు ఉత్పత్తులు ప్రచారం చేయబోను. విమల్ ఇలైచీతో నేను జట్టుకట్టడంపై మీరు వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాను. విమల్ ఇలైచీ నుంచి నేను తప్పుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉంటాను' అని అందులో పేర్కొన్నారు.