అల్లరి నరేష్ పుట్టిన రోజు కానుక-''నాంది'' టీజర్ అదుర్స్ (video)
సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి సినిమాలో నటించిన అల్లరి నరేష్ ప్రస్తుతం ''నాంది'' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ లాయర్ ఆద్య పాత్రలో నటిస్తుండగా, రాధా ప్రకాశ్‌గా ప్రియదర్శి, కిషోర్ అనే పోలీస్ పాత్రలో హరిశ్ ఉత్తమన్, సంతోష్‌గా నటుడు ప్రవీణ్ కనిపించనున్నారు.
లాక్‌డౌన్ కంటే ముందే ఎనభై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను.. అల్లరి నరేష్ పుట్టిన రోజైన మంగళవారం (జూలై 30)న విడుదలైంది.
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ టీజర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ''ఈ ప్రపంచాన్ని టీజర్ రూపంలో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. 'నాంది' చిత్ర బృందానికి నా తరఫున హృదయపూర్వక అభినందనలు. నరేష్ అన్న ఇందులో మీరు అద్భుతంగా ఉన్నారు'' అని టీజర్‌ను పంచుకున్న సందర్భంగా విజయ్‌దేవర కొండ పేర్కొన్నారు.
ఈ టీజర్‌లో అల్లరి నరేష్ నటనకు మంచి మార్కులేపడ్డాయి. నటనలో మెచ్యూరిటీ తెలుస్తోంది. 'ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్ పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సర్.. ఇన్ని సంవత్సరాలు పడుతోంది' అంటూ ప్రశ్నిస్తున్నారు కథానాయకుడు అల్లరి నరేష్. ఈ టీజర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.