'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతికి పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి "తండేల్" మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సంక్రాంతికి విడుదలైన "గేమ్ ఛేంజర్", "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రాల వసూళ్ళపై నిర్మాత అల్లు అరవింద్ సెటైర్లు వేశారు.
సంక్రాంతికి దిల్ రాజు ఒక చరిత్ర సృష్టించారన్నారు. ఒక సినిమానేమో ఇలా తీసుకువెళ్లి అంటూ నేల వైపు చూపించారు. మరో సినిమాని అలా తీసుకువెళ్లారు అంటూ ఆకాశం వైపు చూపించారు. అయితే పరోక్షంగా 'గేమ్ ఛేంజర్'పై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' చిత్రం గురించి అరవింద్ ప్రస్తావించిన విధానం అవమానకరంగా ఉందని అంటున్నారు. మరికొందరు ముందుంది మొసళ్ల పండుగ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.