అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన అల్లు స్టూడియోస్
అక్టోబర్ 1వ తేదీ శనివారంనాటికి అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా చిరకాలం గుర్తిండేలా అల్లు స్టూడియోస్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివార్‌లోని కోకాపేటలోని 10 ఎకరాల స్థలంలో స్వంత స్థలంలో ఏర్పాటు చేసిన స్టూడియో ప్రాంగణంలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. దీనిని శనివారంనాడు మెగాస్టార్ చిరంజీవి అల్లు కుటుంబసభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, పాలకొల్లునుంచి సింగిల్‌గా వచ్చి జాతీయ స్థాయిలో పేరు సంపాదించి అల్లు వారి పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేసిన అల్లు రామలింగయ్యగారి గుర్తుగా స్టూడియోను కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. చలన చిత్రరంగానికి తగినవిధంగా అందుబాటులో వుండేలా ఈ స్టూడియో వుంటుంది అని చెప్పారు. అనంతరం ముంబై వెళ్ళి సల్మాన్ ఖాన్ ప్రెస్‌మీట్‌లో పాల్గొనాలని ఆయన వెళ్ళిపోయారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, అల్లు స్టూడియోస్ గ్రాండ్ ఓపెనింగ్‌కు హాజరైనందుకు మెగాస్టార్ చిరంజీవిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారిపై నానాటికీ పెరుగుతున్న ప్రేమ చూసి ఆశ్చర్యంగా ఉంది. మా తాతయ్య అల్లు రామలింగయ్యగారిని గౌరవించడం కోసం ఈ స్టూడియోను నిర్మించాం. అల్లు రామలింగయ్యగారు మా తాతగారు అని చెప్పుకోవడం గర్వంగా వుంది. చాలామందికి నాన్న, తాతయ్యలు వుంటారు. వారి వారి పరిథిమేరకు గౌరవం ఇస్తుంటారు. కొంతకాలం మర్చిపోతారు. అలా కాకుండా చిరస్థాయిలో నిలిచేలా ఈ స్టూడియోను ప్రారంభించామని చెప్పారు.
ఈ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్, అల్లు అరవింద్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.