Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం
AM Ratnam, keeravani, Jyotikrishna, Nidi
పవన్ కళ్యాణ్ చిత్రం 'హరి హర వీరమల్లు'. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. నిధి అగర్వాల్ కథానాయిక. బాబీ డియోల్ ప్రతినాయకుడు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం నుంచి మూడవ గీతంగా 'అసుర హననం' హైదరాబాద్ లో జాతీయ మీడియా సమక్షంలో విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, ఇంత భారీ సినిమాకి తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ ప్రచారం చేయాల్సి ఉంది. అందుకు మీడియా సహకారం కావాలి. సినిమా ఫీల్డ్ లో నా ప్రయాణం 54 ఏళ్ళు. తెలుగు, తమిళ, హిందీ అన్ని భాషల్లో సినిమాలు తీశాను. 90 శాతానికి పైగా నా సినిమాలు విజయం సాధించాయి. సినిమా ద్వారా వినోదంతో పాటు, ఏదో ఒక సందేశం ఇవ్వాలనేది నా తపన. భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి సినిమాలు అందించాను. హరి హర వీరమల్లు సినిమా తయారవ్వడానికి ముఖ్యకారణం పవన్ కళ్యాణ్ గారు. క్రిష్ గారు చెప్పిన కథ నచ్చి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు తీసుకెళ్ళాను. రత్నం గారి జడ్జిమెంట్ ను నమ్మి ఈ సినిమా చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. నా కుమారుడు అని చెప్పడం కాదు.. జ్యోతికృష్ణ ఈ సినిమా బాధ్యతను తీసుకొని ఎంతో కష్టపడి పని చేశాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సినిమాని పూర్తి చేశాడు. హరి హర వీరమల్లు అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లో విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను." అన్నారు.
చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, "పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ప్రతి దర్శకుడికి కల ఉంటుంది. అది ఒక అవార్డు గెలుచుకున్నట్టుగా ఉంటుంది. నాకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మొదట ఈ ప్రాజెక్ట్ కి పెద్ద పునాది వేసింది క్రిష్ గారు. దానిని పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలని రత్నం గారు ప్లాన్ చేశారు. ఇంత పెద్ద బాధ్యతను ఒలింపిక్ టార్చ్ లాగా క్రిష్ గారు నాకు అందించి ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని, రత్నం గారిని మెప్పించడం మామూలు విషయం కాదు. అలాంటిది ఆ ఇద్దరూ మెచ్చారంటే.. ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయి స్పందన సొంతం చేసుకోబోతుందో మీరే ఊహించుకోవచ్చు. కీరవాణి గారితో పని చేయడం గర్వంగా ఉంది. కీరవాణి గారు అందరినీ ప్రోత్సహిస్తారు. రాంబాబు గారికి సిట్యుయేషన్ చెప్పి, పాట రాయించుకొని కీరవాణి గారిని కలిస్తే.. సాహిత్యం బాగుందని మెచ్చుకున్నారు. నన్ను కూడా ఎంతో ప్రోత్సహించారు. ఓ వైపు ప్రజాసేవ, మరోవైపు ఇచ్చిన మాట కోసం సినిమాలు చేస్తూ విశ్రాంతి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఎంతో శ్రమిస్తున్నారు. ఒక గొప్ప సినిమాని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో నాన్నగారు మొదటి సినిమా నిర్మాతలా ఈ సినిమా కోసం పని చేశారు. కత్తికి, ధర్మానికి మధ్య జరిగే యుద్ధమే ఈ కథ." అన్నారు.
కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, "హరి హర వీరమల్లు అనేది నాకు చాలా ఎమోషనల్ జర్నీ. ఇది నాకొక ఎమోషనల్ ఫిల్మ్. ఈ సినిమాకి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎ. ఎం. రత్నం గారికి కృతఙ్ఞతలు. సినిమా కోసం అంతలా కష్టపడే నిర్మాతను నేను చూడలేదు. జ్యోతి కృష్ణ గారు ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను." అన్నారు.
గీత రచయిత రాంబాబు గోశాల మాట్లాడుతూ, "ఈ సినిమాలో 'అసుర హననం' అనే పాట రాయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. భారతీయుడు, జీన్స్, ఖుషి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాత ఎ. ఎం. రత్నం గారు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గారితో 'హరి హర వీరమల్లు' చేసి జూన్ 12న విడుదల చేయబోతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతికృష్ణ గారికి ధన్యవాదాలు. నాతో 'రూల్స్ రంజన్' సినిమాలో 'సమ్మోహనుడా' అనే పాట రాయించారు. అది చాలా పెద్ద హిట్ అయింది. దానికి వంద రెట్లు ఈ పాట హిట్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమా కోసం జ్యోతికృష్ణ గారు యుద్ధం చేశారు. ఆయన తపస్సు వల్లే ఈ చిత్రం ఇంత త్వరగా పూర్తయింది. ఇక కీరవాణి గారి సంగీతంలో పాట రాయడం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారంటే పోరాటం, పవన్ కళ్యాణ్ గారంటే ప్రకాశం, పవన్ కళ్యాణ్ గారంటే ధైర్యం, పవన్ కళ్యాణ్ గారంటే అన్ లిమిటెడ్ పవర్. దానిని సినిమాకి అన్వయించుకుంటూ పాట రాయమని జ్యోతికృష్ణ గారు చెప్పారు. నాకిచ్చిన బాధ్యతకు నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. " అన్నారు.