"ఆర్ఆర్ఆర్"కు శుభవార్త... టిక్కెట్ ధరల పెంపునకు ఓకే
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో నిర్మించారు. ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. అయితే, తెలంగాణాతో పోల్చితే ఏపీలో సినిమా టిక్కెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య టిక్కెట్ల ధరలు పెంచాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రాధేయపడ్డారు. ప్రత్యేకంగా కలిసి విన్నవించుకున్నారు. దీంతో ఆయన టిక్కెట్లు పెంచుకునేందుకు కరుణించారు.
"ఆర్ఆర్ఆర్" టిక్కెట్ ధరను రూ.100 మేరకు పెంచుకునేందుకు సీఎం జగన్ ఓకే చెప్పారు. అలాగే, బెనిఫిట్ షోలకు కూడా ప్రభుత్వం మద్దతు లభించింది. ఎగ్జిబిటర్లు పెద్ద సినిమాలను రోజుకు ఐదు షోలు ప్రదర్శించవచ్చని ఏపీ మంత్రి పేర్నినాని తెలిపారు. పెద్ద సినిమా, చిన్న సినిమా ఒకే రోజు విడుదలైతే ఎగ్జిబిటర్లు కనీసం రోజుకు ఒక్కసారైనా చిన్న సినిమాను ప్రదర్శించాలని ఆయన కోరారు.