గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (17:05 IST)

జబర్దస్త్ నరేష్‌పై దాడి... ఆ పనే కారణమా?

జబర్దస్త్‌లో తన చిన్న ఆకారంతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు నరేష్. జబర్దస్త్‌తో పాటుగా వివిధ కార్యక్రమాలలో కనిపిస్తున్నాడు ఈ కమెడియన్. జబర్దస్త్‌లో పేరు పొందిన కమెడియన్స్‌కు ప్రైవేట్ ఈవెంట్‌లు కూడా బాగానే వస్తుంటాయి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కళింగాంధ్ర ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడి నుండి తిరిగి వస్తున్నప్పుడు కొందరు యువకులు దారి కాచి వీరి మీద దాడి చేసారు. దీంతో నరేష్‌కు, అతని బృందానికి స్వల్ప గాయాలయ్యాయి.
 
వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం కళింగాంధ్ర ఉత్సవాలలో కొన్ని ఈవెంట్‌లలో పాల్గొనేందుకు జబర్దస్త్ నరేష్‌కు ఆహ్వానం వచ్చింది. అక్కడికి హాజరైన నరేష్ తమ పర్‌ఫార్మెన్స్‌ బయట గ్రీన్ రూమ్‌లో బౌన్సర్‌లకు మరియు కొంతమంది యువకులకు మధ్య వాగ్వివాదం జరుగుతుండగా గమనించి, ఆ గొడవ సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 
 
ఈ విధంగా నరేష్ మధ్యలో కల్పించుకోవడం నచ్చని యువకులు కోపోద్రిక్తులై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమాలు ముగిశాక తిరుగు ప్రయాణమైన నరేష్, అతని బృందం వెళ్తున్న వాహనాన్ని చిన్నబారటానికి చెందిన యువకులు ఆపి దాడికి దిగారు. ఆ యువకులలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా మిగిలినవారంతా పారిపోయారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.