శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 7 జనవరి 2023 (14:58 IST)

'వీరసింహారెడ్డి' ఒక విస్ఫోటనం.. చరిత్రలో నిలిచిపోతుంది: నందమూరి బాలకృష్ణ

balakrishna
గాడ్ అఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి టీజర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. అలాగే ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా ఆలరించాయి. 
 
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి చిత్ర యూనిట్‌లో ఒంగోలులో మాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని చాలా గ్రాండ్‌గా నిర్వహించింది. భారీగా తరలివచ్చిన అభిమానులు సమక్షంలో 'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్ వేడుక కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ చేతుల మీదగా విడుదలైన 'వీరసింహారెడ్డి' ట్రైలర్ ప్రేక్షకులు, అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది.
 
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి స్వరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా తండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి శత జయంతి  అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 
 
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కుటుంబ సభ్యుడు దర్శకుడు బి గోపాల్ గారికి కృతజ్ఞతలు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహనాయడు ఇలా చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు అందించారాయన. ఈ వేడుకకు బి గోపాల్ గారు ఒక పెద్దరికాన్ని తీసుకొచ్చారు. ఇన్ని కోట్ల మంది అభిమానులని పొందానంటే అది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుంటుంది. నటీనటుల నుండి ప్రతి టెక్నిషియన్ నుండి టాలెంట్‌ని తీసుకునే సత్తా వున్న ఒంగోలు గిత్త మలినేని గోపిచంద్. 
 
సినిమా మాధ్యమం ద్వారా సమరవీరుడిని నేను. మానవరణ్యంలో కల్మషం కుతంత్రాలని వేటాడే సింహరాజుని సింహాన్ని నేనే. అలాగే ఒక హుందాతనంతో రోషానికి పౌరుషానికి ప్రతీకనైన రెడ్డిని నేనే .. నాయుడిని నేనే. (నవ్వుతూ) ప్రేక్షకులు, అభిమానులు చూపిస్తున్న అనంతరమైన అభిమానానికి నేను అపూర్వంగా అనురాగంగా పరిచే మనసు మీ బాలకృష్ణ ది. ఎన్నో రకాల సినిమాలు చేశాను. ఇంకా కసి తీరలేదు. ‘అఖండ’కు మించిన విజయాన్ని అందుకోవాలి దాని చేరుకోవాలనేది ఒక బరువు అనుకోలేదు. 
 
ఇప్పుడు వీరసింహా రెడ్డిని తీశాం. ఇది ఒక ఎపిక్. ‘సీమ‌లో ఏ ఒక్కడూ క‌త్తి ప‌ట్టకూడ‌ద‌ని నేనొక్కడినే క‌త్తి ప‌ట్టా’ అనే డైలాగ్ ఇందులో వుంది. దీని వెనుక పెద్ద కథ వుంది. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లెజెండ్, అఖండ ఎలాగో వీరసింహా రెడ్డి కూడా చరిత్రలో నిలిచిపోతుంది. శ్రుతి హాసన్ కమల్ హాసన్ గారికి తగ్గ తనయ. అందంగా కన్నుల విందుగా అద్భుతంగా నటించింది. హనీ రోజ్ పాత్ర గురించి ఇప్పుడు చెప్పకూడదు. చాలా అద్భుతమైన పాత్ర. సినిమా చూశాక అందరూ ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటారు. దునియా విజయ్ చాలా అద్భుతంగా చేశారు. ఆయనకి చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి. 
 
అలాగే అజయ్ ఘోష్, సప్తగిరి అందరూ చక్కగా చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్, వెంకట్ మాస్టర్ చాలా అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. తమన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. రిరికార్డింగ్ లో సౌండ్ బాక్సులు బద్దలౌతాయి. బుర్రసాయి మాధవ్ గారు పదునైన డైలాగ్స్ అందించారు. మా నిర్మాతలు రవి గారు నవీన్ గారు అద్భుతమైన నిర్మాతలు. టర్కీలో కూడా షూట్ చేశాం. సినిమాకి కావాల్సిన సమస్తం సమకూర్చారు. వీరసింహా రెడ్డి ఒక విస్ఫోటనం. బాగా ఆడుతుందని చెప్పను.. బాగా ఆడి తీరుతుంది. ప్రేక్షకులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.