గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (13:02 IST)

కోర్టు మెట్లెక్కిన కన్నడ నటుడు ఉపేంద్ర... అరెస్టు నుంచి తప్పించుకునేనా?

Upendra
కన్నడ నటుడు ఉపేంద్ర చిక్కుల్లో పడ్డారు. ఓ కన్నడ సామెతను ఉదహరించి ఆయన వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆయనపై కొన్ని దళిత సంఘాల నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పలు పోలీస్ స్టేషన్‌లలో ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. దీంతో ఆయన ఏ క్షణమైన అరెస్టు కావొచ్చంటూ ప్రచారం జరగడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, తాజాగా ఆయన కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలంటూ ఆయన కోరుతున్నారు. 
 
చెన్నమ్మనకెరె అచ్చుకట్ట ఠాణాలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే స్టే ఇచ్చింది. హలసూరు గేట్ ఠాణాతో పాటు ఇతర ప్రాంతాల్లోని కొన్ని ఠాణాల్లో దళిత సంఘాలకు చెందిన నేతలు ఉపేంద్రపై కేసులు పెట్టారు. పోలీసులు తనను అరెస్టు చేస్తారన్న భీతితో ఉపేంద్ర ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. సదాశివనగర, కత్రిగుప్పెలోని ఆయన నివాసాల వద్ద పోలీసులు భద్రత కల్పించారు.
 
ఉపేంద్ర తరపున ఆయన న్యాయవాది ఉదయ్‌ హొళ్ల కోర్టును ఆశ్రయించారు. ఉపేంద్రపై ఐదేళ్ల నిషేధాన్ని విధించాలంటూ సామాజిక కార్యకర్త నవీన్‌గౌడ చలనచిత్ర వాణిజ్య మండలిని డిమాండ్‌ చేశారు. ప్రజాకీయ పార్టీని నెలకొల్పి ఆరేళ్లయిన నేపథ్యంలో ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ, 'ఊరన్న తర్వాత మంచి, చెడు ఉంటుంది. సమాజంలో మంచికే పెద్ద పీట వేయాలి. చెడును తొలగించేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలి' అని చెబుతూ, కన్నడలో ఒక సామెత చెప్పారు. 
 
ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆ వీడియో పోస్టును తన ఫేస్‌బుక్‌ పేజీ నుంచి ఉపేంద్ర తొలగించారు. విచారణకు హాజరు కావాలని సీకే అచ్చుకట్టు ఠాణా పోలీసులు ఉపేంద్ర నివాసానికి నోటీసులు పంపించారు. బెంగళూరు, రామనగర జిల్లాల్లోని దళిత సంఘాల నేతలు ఉపేంద్రకు వ్యతిరేకంగా బుధవారం కూడా ఆందోళనలను కొనసాగించారు. దీంతో ఆయన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.