ఆమె ధనిక భారతీయురాలంటున్న సోనూసూద్
దేశంలో ఆస్తి, అంతస్తులు, డబ్బు, దర్పం, కీర్తి, పదవి వుంటే చాలదు. మానవత్వం వుండాలంటారు పెద్దలు. మానవ సేవే మాధవ సేవ అని పురాణాలు చెబుతున్నాయి. అలా మాధవ సేవ చేసేవారు చాలా మంది దేశంలో వున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా, ఇతరత్రా కారణాల వల్ల కొందరు తమ వంతు సాయంగా ఎంతో కొంత అర్హులకు చేస్తూనే వుంటారు. ఇప్పుడు కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్ అందక, సమయానికి డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రికి రాలేకపోతున్నారు చాలామందే వున్నారు. సోనూసూద్ వంటి మానవతావాది చేస్తున్న సేవలు చెప్పనలవి కావు.
ఇక తన పేరుతో వున్న సూద్ ఫౌండేషన్‌కు ఎవరైనా సాయం చేయవచ్చని సోనూసూద్ ప్రకటించగానే వేళ్ళమీద లెక్కించే వ్యక్తులు స్పందించారు. అలాంటిది ఓ అంధురాలు స్పందించి ఆయనకు అండగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని వరికుంటపాడు అనే చిన్న గ్రామం నుండి బొడ్డు నాగలక్ష్మి అనే ఆమె తన వంతు సాయంగా సూద్ ఫౌండేషన్‌కు 15,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆమె అక్కడ అందరికీ తెలిసిన అంధురాలే కాకుండా యూట్యూబర్ కూడా. ఆమె తన ఐదు నెలల పెన్షన్‌ను ఇలా ఫౌండేషన్‌కు అందజేసింది.
అందుకు సోనూసూద్ స్పందించారు. నాకు ఆమె ధనిక భారతీయురాలు. ఒకరి బాధను చూడటానికి మీకు కంటి చూపు అవసరం లేదు. ఎ ట్రూ హీరోఫ్లాగ్ ఆఫ్ ఇండియా అంటూ సూద్ ట్వీట్ చేశాడు. ఈ సంఘటనను పాలకులు కూడా ఛాలెంజ్‌గా తీసుకోవాల్సిందే.