గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (11:03 IST)

బాలీవుడ్ డ్రగ్స్ కేసు : నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్ అరెస్టు.. ఎన్సీబీ కస్టడీ

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, అక్టోబరు మూడో తేదీ వరకు ఎన్సీబీ కస్టడీకి కోర్టు అప్పగించింది. 
 
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్‌ను ఎన్సీబీ ఈ నెల 26వ తేదీన అరెస్టు చేసింది. ఆ తర్వాత 27వ తేదీ ఆదివారం కావడంతో 28వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టింది.
 
అతడి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, కాబట్టి 9 రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరగా, న్యాయస్థానం ఆరు రోజులు అంటే అక్టోబరు 3 వరకు అనుమతి నిచ్చింది. సుశాంత్ మరణంతో సంబంధం ఉన్న నిందితులతో ప్రసాద్‌కు డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్టు ఎన్‌సీబీ కోర్టుకు తెలిపింది.
 
కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ప్రసాద్ కొట్టిపడేశారు. తనను ఇరికించారని ఆరోపించారు. క్షితిజ్ ప్రసాద్ ఇంటి నుంచి అధికారులు కొంత మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేయడానికి ముందు ప్రసాద్‌ను విచారించారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రసాద్ తప్పించుకోవడంతో అతడి కస్టడీ ఎన్‌సీబీకి అవసరమైంది.