చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ.. సీఎంతో చర్చలపై కసరత్తు
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా సీఎం జగన్‌కి విన్నవించాల్సిన అన్ని విషయాలపై కూలంకుశంగా చర్చించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై సినీ పెద్దలు చర్చించారు. ఏపీలో సినిమా టికెట్ ధరలపై సీఎం జగన్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సినీ కార్మికులు, థియేటర్ కార్మికుల సమస్యలు, విద్యుత్ టారిఫ్‌పై కూడా చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో హీరో నాగార్జున అక్కినేని, అల్లు అరవింద్, దగ్గుబాటి సూరేశ్ బాబు, దిల్ రాజు, మైత్రి మూవీస్ రవి ప్రసాద్ తదితరులు హజరయ్యారు.
ఈ సమావేశంలో పదేళ్ల కిందటి టిక్కెట్ రేట్లను ఖరారు చేస్తూ.. పవన్ కల్యాణ్ సినిమా వకీల్ సాబ్ వచ్చిన సమయంలో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ సమస్యను ప్రభుత్వంతో చర్చించి.. గతంలోలా విడుదల సమయంలో టిక్కెట్ రేట్లను పెంచుకునేలా ఒత్తిడి తేవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. చిన్న సినిమాల మనుగడ కోసం ఐదో షోకు కూడా అనుమతి ఇవ్వాలని అడగాలని నిర్ణియంచుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికి ఏపీలో మూడు షోలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఈ కారణంగా చాలా థియేటర్లను ఇంత వరకూ ప్రారంభించలేదు. వచ్చే నెల నుంచి చిరంజీవి ఆచార్య సహా చాలా సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఆలోపున సమస్యలు పరిష్కారం అయితే టాలీవుడ్ ఒడ్డున పడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వంతో చిరంజీవి సన్నిహితంగా ఉంటున్నారు. ఇప్పుడు నేరుగా చిరంజీవికే ఆహ్వానం పంపినందున.. ప్రభుత్వం కూడా మెగాస్టార్ ఇచ్చే విజ్ఞాపనలకు సానుకూలంగా స్పందిస్తుందని అంచనా వేస్తున్నారు.