ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (10:16 IST)

మెగాస్టార్ చిరంజీవి కుడిచేతికి శస్త్రచికిత్స.. ఆందోళనలో చిరు ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి కుడిచేతికి శస్త్రచికిత్స జరిగింది. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో  ఆదివారం చిరంజీవి భేటీ అయ్యారు. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. కాగా, తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.
 
ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనగా ఆయన కుడి చేతికి బ్యాండేజ్‌ ఉండటం వల్ల అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చేతికి ఏమైనా గాయమైందేమోనని ఆయనను అడగ్గా, తన అరచేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని చెప్పారు. కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరిగా ఉండటం వల్ల వైద్యులను కలిసినట్లు చిరు వెల్లడించారు. 
 
అయితే కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్‌ మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని దానిని 'కార్పల్ టన్నెల్ సిండ్రోమ్' అంటారని డాక్టర్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని, 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని చిరంజీవి పేర్కొన్నారు. 
 
ఈ సర్జరీ జరిగిన పదిహేను రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యథావిధిగా పని చేస్తుందని వివరించారు. సర్జరీ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న 'గాడ్ ఫాదర్' షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చినట్లు వెల్లడించారు. చేతికి జరిగిన సర్జరీ విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని చిరు అభిమానులకు తెలిపారు