సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 21 మార్చి 2020 (21:31 IST)

ఓ వైపు కరోనా - మరోవైపు షూటింగ్స్ బ్రేక్ - మన స్టార్స్ ఏం చేస్తున్నారు?

ఎక్కడ చూసినా కరోనా కరోనా కరోనా.. ఇదే టాపిక్. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో సినిమా షూటింగ్స్ బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మార్చి 31 వరకు షూటింగ్స్ ఆపేసారు. ఏప్రిల్ 1 నుంచి అయినా షూటింగ్స్ స్టార్ట్ చేస్తారా అంటే.. ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇదే పరిస్థితి ఇలాగే ఉంటే... ఇంకో వారం పొడిగించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. షూటింగ్స్‌కి బ్రేక్ పడటంతో మన స్టార్స్ ఏం చేస్తున్నారు..? అనేది ఆసక్తిగా మారింది. 
 
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో చరణ్‌ సరసన నటించే కథానాయిక ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే.. షూటింగ్స్‌కి బ్రేక్ పడటం వలన చిరంజీవి ఇప్పటివరకు చూడనటువంటి సినిమాలను ఇటీవల రిలీజైన సినిమాలు చూస్తున్నారని తెలిసింది.
 
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటితో సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. అయితే.. తదుపరి చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్‌తో చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా కథ చర్చల్లో పాల్గొంటున్నారు. ఇక కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న సినిమా వైల్డ్ డాగ్. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడటంతో నాగార్జున తదుపరి చిత్రం బంగార్రాజుకు సంబంధించిన వర్క్ లో బిజీగా ఉన్నారని తెలిసింది. ఇక విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. 
 
సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. 
ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడటంతో వెంకీ ఎఫ్ 3 సినిమాకి సంబంధించిన డిష్కషన్స్‌లో పాల్గొంటున్నారని తెలిసింది. యువ హీరోల్లో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమా షూటింగ్‌లో అఖిల్‌కి గాయాలు కావడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపధ్యంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు టైమ్ దొరకడంతో బాక్సింగ్‌లో ఇంకా ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలిసింది. 
 
పూరి తనయుడు ఆకాష్‌తో రొమాంటిక్ అనే సినిమా తీసారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించిన వర్కులో పూరి ఉన్నారని తెలిసింది. ఇలా.. షూటింగ్స్‌కి బ్రేక్ రావడంతో కొంతమంది సినీ ప్రముఖులు తదుపరి చిత్రాల కథా చర్చల్లో పాల్గొంటుంటే.. మరికొంత మంది సినిమాలు చూస్తూ.. బుక్స్ చదువుతూ టైమ్ స్పెండ్ చేస్తున్నారని సమాచారం.