శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (16:10 IST)

నా రూటే సెపరేటు... మిస్సైల్స్ పరీక్షల్లో ఉ.కొరియా దూకుడు

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని తల్లడిల్లిపోతోంది. కానీ, ఉత్తర కొరియా మాత్రం తమ రూటు సెపరేటు అంటూ మరోమారు నిరూపించింది. ఇటీవల కరోనా లక్షణాలు సోకినట్టు అనుమానించిన ఓ అధికారిని ఉ. కొరియా సైన్యం కాల్చిచంపినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఉత్తర కొరియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 
 
ఇదిలావుంటే, కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో ఉత్తర కొరియా సైన్యం చిన్న తరహా బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగించింది. ఈ క్షిపణి ప్రయోగాలను వీక్షిస్తూ ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తాపీగా వీక్షిస్తూ కూర్చుండిపోయారు. అంతేకాదు కరోనాను ఉత్తర కొరియా సమర్థవంతంగా ఎదుర్కొందని తెలియజేసేందుకు ఏకంగా 700 మంది అధికారులు ఒక్కచోట చేరాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
అంతేకాకుండా, తమ దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం లేదని చాటి చెప్పేందుకు ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్‌ అసెంబ్లీ శనివారం సమావేశం కానుందని స్థానిక మీడియా వెల్లడించింది. దాదాపు 700 మంది ఉన్నతాధికారులు అంతా ఒక్కచోట చేరి ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారని వెల్లడించింది. 
 
ఈ క్రమంలోనే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ క్షిపణుల ప్రయోగానికి సైనిక అధికారులను శుక్రవారం ఆదేశించింది. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్వయంగా వీక్షించారని.. ఆ సమయంలో మాస్కులు ధరించలేదని వెల్లడించారు. 
 
కాగా చైనాలో కరోనా వైరస్ మూలాలు బయటపడిన నాటి నుంచి.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అన్ని సరిహద్దు దేశాలు సహా దౌత్యపరంగా తమకు మిత్రపక్షంగా ఉన్న ఏకైక దేశం చైనా సరిహద్దును సైతం మూసివేశారు. 
 
అంతేకాకుండా... కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమ దేశ పౌరులతో పాటు విదేశీయులను కూడా ఎప్పటికప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నా.. అధికారులకు సహకరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ సోకినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని ఉత్తర కొరియా పాశవికంగా హతమార్చినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.