సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (19:40 IST)

టాలీవుడ్ కేరాఫ్ వైకాపా.. కారణమేంటబ్బా???

వైకాపా అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్‌ను నిజంగానే దత్తత తీసుకున్నట్లు ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలోని అందరూ ఆయన చుట్టూ చేరిపోతున్నారు. పరిశ్రమలోని అందరూ వరుసగా ఇక్కడే ప్రత్యక్షమవుతున్నారు. తాజాగా శివాజీరాజా కూడా వచ్చి చేరబోతున్నాడని వినికిడి.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న ఈ స‌మ‌యంలో ఇప్పుడు సినిమా తార‌లంద‌రి దృష్టి వైకాపా వైపు సాగుతోంది. ఒక్క‌రో ఇద్ద‌రో అయితే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు అంద‌రి అడుగులు వైకాపా వైపే పడుతున్నాయి. దాంతో జ‌గ‌న్ ఇప్పుడు కేరాఫ్ టాలీవుడ్ అయిపోయాడు. ఓ వైపు టాలీవుడ్‌కే చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ ఉన్నప్పటికీ... సినీ తార‌లు ఎవ‌రూ అటువైపు వెళ్లకపోవడం విచిత్రం అనిపిస్తోంది.
 
టాలీవుడ్‌లో ప‌వ‌న్‌కి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన ఆలీ కూడా పవన్‌ని కాదని తెదేపాలో చేరి ఆ తర్వాత మంత్రి పదవి కోసం వైకపాలో చేరిపోవడం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. ఎన్నికలలో పోటీ చేయనవసరం లేకుండానే జగన్ ఆయనకు మంత్రి పదవి ఇస్తానన్నాడని ఒక వార్త కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకోవలసి ఉంటుంది. కానీ మిగిలిన అందరూ జ‌గ‌న్ నామ‌జపంలో మునిగి తేలుతూండడానికి కారణం మాత్రం విశ్లేషకులు చెప్పలేకపోతున్నారు. 
 
అప్పుడెప్పుడో చేరిన రోజా నుంచి ఇప్పుడు తాజాగా చేరబోయే శివాజీరాజా వ‌ర‌కు అందరూ వైకాపా తీర్థం పుచ్చుకున్న వారే. ఒకప్పట్లో తెదేపాలో ఎక్కువ మంది సినిమా తార‌లు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం సినిమా వాళ్లంద‌రికీ వైకాపా బెస్ట్ ఆప్ష‌న్‌గా మారిపోయింది. వ‌ర‌స‌గా అంతా వ‌చ్చి జ‌గ‌న్ పంచ‌న చేరుతున్నారు.

ఎప్పుడో చేరిన రోజా, రాజ‌శేఖ‌ర్‌లు కాకుండా తాజాగా సూప‌ర్ స్టార్ కృష్ణ, ఆ త‌ర్వాత థర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ, వినాయ‌కుడు ఫేమ్ కృష్ణుడు, పోసాని కృష్ణ ముర‌ళిలాంటి వాళ్లంతా ఇప్ప‌టికే జ‌గ‌న్ పార్టీలో ఉంటూ పార్టీకి స‌పోర్ట్ చేస్తున్నారు. ఇక మొన్న‌టికి మొన్న సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ కూడా తెలుగుదేశం నుండి జ‌గ‌న్ పార్టీలో చేరింది. తాజాగా మ‌రో ఇద్ద‌రు కూడా ఈ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
 
నాగార్జున‌కు అత్యంత స‌న్నిహితుడు, స్నేహితుడు పివిపి కూడా వైకాపాలో చేరాడు. ఈయ‌న విజ‌య‌వాడ ఎంపి సీట్ కోసం పోటీ ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. ఆ మ‌ధ్య లోట‌స్ పాండ్ వెళ్లి నాగార్జున కూడా జ‌గ‌న్‌ను క‌లిసి వ‌చ్చింది ఈ విష‌యం గురించే అనే టాపిక్ అప్పట్లో న‌డిచింది. ఇప్పుడు అదే నిజ‌మైంది కూడా.

పైగా పీవీపీ (పొట్లూరి వరప్రసాద్) కూడా మీ కోసం నాగార్జున ప్ర‌చారం చేస్తాడా? అంటే ఏమో చూద్దాం అంటున్నాడు. మొత్తానికి ఈ ఎన్నిక‌ల సమయానికి వైకాపా నిండా సినిమా వాళ్లే క‌నిపిస్తున్నారు. మ‌రి వీళ్ల‌ని హైకమాండ్ ఎంత మేరకు ఉపయోగించుకుంటుంది.. వీళ్లల్లో ఎంత మంది స‌త్తా చూపిస్తార‌ు అనేది మాత్రం చూడాల్సిందే.